telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు స్వాగతిస్తున్నా-మంత్రి రేణుకా చౌదరి

జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. టీఆర్‌ఎస్‌ పై నిప్పులు చెరిగారు.

రేణుకా చౌదరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని రేణుకాచౌదరి అన్నారు. ఒక్కరోజే ముగ్గురు మైనర్లపై రేప్ జరిగిందని… హైదరాబాద్‌లో షీ టీమ్స్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.

తెలంగాణలో పసిపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేద‌న చెందారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే..?. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగారుస్తున్నారు. 

మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుపై కేసు నమోదు కావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లుగా రేణుకా చౌదరి వెల్లడించారు. బాధితురాలి వివరాలు బయటపెట్టడమంటే నేరం చేయడమే అని అన్నారు.

ఘటన తర్వాత ఐదారు రోజుల పాటు ఇన్నోవా కారు దొరకలేదని… ఇన్నోవా కారులో దొరికిన ఆధారాలు నిజమైనవేనా అని నిలదీశారు.

ఇన్నోవా కారు వీడియోలను రఘునందన్ రావు ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నేతల పిల్లలుంటే రఘునందన్ రావు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు

ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేద‌న్నారు. హోంమంత్రి పదవి నుంచి మహమూద్ అలీ తప్పుకోవాలని రేణుకాచౌదరి డిమాండ్ చేశారు.

 

 

 

Related posts