telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తప్పా… ఒప్పా… ? అనేది పక్కన పెడితే… చావును వాళ్లే కొని తెచ్చుకున్నారు : రేణూ దేశాయ్

Renu-Desai

తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో దిశను హత్య చేసిన నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా… సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా.. ఈ ఎన్‌కౌంటర్‌పై నటి, నిర్మాత రేణుదేశాయ్ స్పందించారు. ఓ టీవీ చానెల్‌ డిబెట్‌లో మాట్లాడిన ఆమె ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రేణు స్పందిస్తూ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేవారికి ఏ మాత్రం మానవత్వం ఉందో ఆలోచించుకోవాలన్నారు. ‘నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని నేను సమర్థిస్తున్నాను. తప్పా.. ఒప్పా.. ఎందుకు జరిగింది..? ఎలా జరిగింది..? అనేది పక్కనెడితే జరిగింది.. మంచిగానే జరిగిపోయింది. నిందితులు పరిగెట్టడానికి ప్రయత్నించి వాళ్ల చావును వాళ్లే కొని తెచ్చుకున్నారు. ఈ ఘటన చూసిన తర్వాత.. మరొకరు ఇలాంటివి చేయాలంటే భయపడతారు. ఆడపిల్లల గురించి ఆలోచించాలంటేనే భయపడాలి.. ఆ పరిస్థితులు రావాలి’ అని ఈ సందర్భంగా రేణు చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్‌ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు.

Related posts