telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైదరాబాద్ సినిమా అభివృద్ధిలో దుక్కిపాటి పాత్ర ఎంత ?

Dukkipati

‘అన్నపూర్ణా’ సంస్థకు తెలుగు చలనచిత్ర చరిత్రలో అద్వితీయమైన స్థానముంది. 1951లో పురుడు పోసుకున్న ఈ సంస్థ, నిజాయితీ, నిబద్ధతలనే పెట్టుబడిగా నమ్మి, సామాజిక బాధ్యతను గుర్తుచేసే సినిమాలను అసంఖ్యాకంగా నిర్మించి, విశేష ఆదరణతో విజయాలు సాధించింది. దొంగరాముడు, తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, ఇద్దరుమిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, పూలరంగడు వంటి ఎన్నో మంచి చిత్రాలు అన్నపూర్ణ సంస్థ ద్వారా వచ్చినవే. నిబద్ధతతో చలనచిత్రాలను రూపొందించిన నిర్మాతలు కొందరే… వారిలో దుక్కిపాటి మధుసూదనరావు బాణీ ప్రత్యేకమైనది. పండిత పామరులను అలరించడమే ధ్యేయంగా దుక్కిపాటి చిత్రాలను నిర్మించారు…అందుకు తగ్గ కథలనే ఎంపిక చేసుకున్నారు… వాటిలో సంగీతసాహిత్యాలకు ప్రాధాన్యమిస్తూ సాగారు…. అందువల్లే దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన చిత్రాల్లోని పాటలు మధురాతిమధురంగా ఈ నాటికీ పులకింపచేస్తూనే ఉన్నాయి. అక్కినేనికి చిత్రసీమలో మార్గదర్శిగా నిలచి ఆయన అభినయపర్వం చరిత్రలో నిలచిపోయేలా చేయడంలో ప్రధానభూమిక పోషించారు దుక్కిపాటి… ఎన్నో అపురూప చిత్రాలను తెలుగువారికి అందించి, వారి మదిలో తమ అన్నపూర్ణ సంస్థకు చెరగని స్థానం సంపాదించుకున్నారు. జూలై 27 దుక్కిపాటి మధుసూదనరావు 103వ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు…

నాటకరంగం మీద మక్కువతో…
కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పెయ్యేరు గ్రామంలో దుక్కిపాటి మధుసూదనరావు జూలై 27, 1917 న జన్మించారు. వారి తల్లిదండ్రులు గంగాజలం, సీతారామస్వామి. వారిది సంపన్న వ్యవసాయ కుటుంబం. బందరు నోబుల్ కళాశాలలో బి.ఏ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీ మొత్తానికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించారు. ముదినేపల్లిలో ఎక్సెల్సియర్ క్లబ్ వుండేది. ఆ క్లబ్బు రంగస్థల నటులతో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ వుండేది. మధుసూదనరావు ఆ క్లబ్బుకి వెళుతూ వుండేవారు. సాంఘిక నాటకాలను ప్ర్తదర్శిస్తే ప్రజలను చైతన్యవంతులను చేయవచ్చు అని ఆ క్లబ్బు యాజమాన్యానికి మధుసూదనరావు సూచించారు. నిర్వాహకులకు మధుసూదనరావు అలోచనలు నచ్చి ఆయనకే కార్యదర్శి పదవి కట్టబెట్టి, సాంఘిక నాటకాలు రాయించి ప్రదర్శింపజేసే బాధ్యతలను అప్పగించారు. మధుసూదనరావు చొరవతీసుకొని గుడివాడ హై స్కూలులో తెలుగు టీచరుగా పనిచేస్తున్న కోనేరు కుటుంబరావు చేత ‘ఆశాజ్యోతి’ అనే నాటకాన్ని, సూరపనేని శోభనరావుతో ‘సత్యాన్వేషణ’ అనే మరో నాటకాన్ని రాయించి వాటిని ప్రదర్శింజేయడం మొదలుపెట్టారు. ‘సత్యాన్వేషణ’ నాటకం వితంతు వివాహాలు, కుల, మత సంకుచిత భావాల నిర్మూలన వంటి ప్రగతిశీలక భావాలకు అద్దంపట్టింది. 1941-44 మధ్యకాలంలో ఈ రెండు నాటకాలు విస్తృతంగా ప్రదర్శించబడటంతో, యువతలో వామపక్ష భావాలు, విప్లవ చైతన్యం రేకెత్తే అవకాశాలకు తావిస్తుందని ప్రభుత్వం వాటి ప్రదర్శనను నిషేధించింది. ఈ నాటకాలు ప్రదర్శించే సమయంలోనే మధుసూదనరావుకు ఒక సమస్య ఎదురైంది. ఆరోజుల్లో స్త్రీ పాత్రలు ధరించేందుకు మహిళలు యెవరూ ముందుకు వచ్చేవారుకాదు. దాంతో మధుసూదనరావు ఎవరైనా లేత కుర్రాడిని అన్వేషించే పనిలో పడ్డారు. అదేసమయంలో గుడివాడలో ‘విప్రనారాయణ’ నాటకం ప్రదర్శిస్తుంటే మధుసూదనరావు ఆ నాటకానికి మిత్రుడు పెండ్యాల నాగేశ్వరరావు (తరవాతి రోజుల్లో ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా ఎదిగారు)తో కలిసి వెళ్ళడం జరిగింది. ఆ నాటకంలో దేవదేవి పాత్రను అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. అక్కినేని నటన నచ్చి మధుసూదనరావు వెంటనే అక్కినేని పెద్దన్నయ్య రామబ్రహ్మంను ఒప్పించి నాగేశ్వరరావును తమ నాటక సమాజంలో చేర్చుకున్నారు. 1945లో తొలిసారి గుడివాడలో ఆంధ్ర నాటక కళాపరిషత్తు మహాసభలు నిర్వహించడం కోసం దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం, నటి భానుమతి లను ఆహ్వానించి, వారిచేత విజేతలకు బహుమతులు ప్రదానం చేయించారు. ఆ కార్యక్రమానికి ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతి ఎం.ఆర్. అప్పారావు అధ్యక్షత వహించారు. అలా నాటక సినీ రంగాలను అనుసంధానించే ప్రయత్నం చేశారు. ఈ పరంపరలో 1947లో విజయవాడ లో కళాపరిషత్తు నాటకాలను నిర్వహించి, ప్రముఖ హిందీచిత్ర నిర్మాత, దర్శకుడు వి. శాంతారాంను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి సత్కరించారు. అలాగే 1950లో కాకినాడలో కళాపరిషత్తు నాటకాలను నిర్వహించి బహుమతి ప్రదానోత్సవానికి ప్రముఖ రంగస్థల, సినీ నటులు పృద్విరాజ్ కపూర్ ని ఆహ్వానించి జయప్రదం చేశారు. 1952 వరకు అలా పరిషత్తు నాటకాలను నిర్వహిస్తూ మధుసూదనరావు నాటకరంగానికి విశిష్ట సేవలు అందజేశారు. ఈ ఆంధ్రనాటక కళాపరిషత్తు ద్వారా అనేకమంది కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకొని సినీరంగం లో స్థిరపడ్డారు. వారిలో ఆచార్య ఆత్రేయ, డి.వి. నరసరాజు, పింగళి నాగేంద్రరావు, పినిశెట్టి, సావిత్రి, నిర్మల మొదలగువారు ముఖ్యులు. తరవాత మధుసూదనరావు దృష్టి సినిమారంగం మీద పడింది.

అక్కినేని సినీరంగ ప్రవేశంతో మొదలై…
ఆంధ్రనాటక కళాపరిషత్తుల నిర్వహణలో వుంటూనే తెలుగు సినిమారంగ ప్రముఖులతో మధుసూదనరావు సత్సంబంధాలు నెరపుతూ వచ్చారు. 1944 వేసవికాలంలో ముదినేపల్లి ఎక్సెల్సియర్ డ్రమాటిక్ అసోసియేషన్ బృందం తెనాలి పట్టణంలో నాటకం ప్రదర్శించి గుడివాడ వెళ్లేందుకు ఉదయాన్నే మద్రాస్-పూరి ప్యాసింజర్ ఎక్కి బెజవాడ రైల్వే స్టేషనుకు చేరుకుంది. ఆ బృందానికి నాయకుడు మధుసూదనరావు, నాటక నిర్వాహకుడు కోడూరు అచ్చయ్య చౌదరి. అదే స్టేషనులో మద్రాసు వెళ్లేందుకు గ్రాండ్ ట్రంక్ ఎక్ష్ ప్రెస్ కోసం దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య ప్లాట్ ఫారం మీద వెయిట్ చేస్తున్నారు. ఇంతలో పూరి ప్యాసింజర్ లో ఒక అబ్బాయి కిటికీలోంచి చూస్తూ ఆయన కంటపడ్డారు. అతడే దుక్కిపాటి వారి నాటక సమాజంలో ఆడవేషాలు వేసే అక్కినేని నాగేశ్వరరావు. అప్పుడు బలరామయ్య ‘సీతారామ జననం’ సినిమాకోసం నటీనటుల ఎంపిక పనిలో వున్నారు. రాముడి వేషానికి ‘అక్కినేని’ అయితే బాగుంటుందనిపించి “సినిమాలలో నటిస్తావా” అని అడిగారు. అంతకు ముందే బాలనటుడిగా ‘ధర్మపత్ని’(1939)లో చిన్న వేషం కట్టిన అక్కినేనికి ‘రైతుబిడ్డ’, ‘తల్లిప్రేమ’ వంటి సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇస్తానని చెప్పి తప్పించుకున్న నిర్మాతల వ్యవహారశైలి నచ్చని అక్కినేని అన్నయ్య మొదట “నో” అని చెప్పినా, బలరామయ్య ఇచ్చిన భరోసాతో “సరే” అన్నారు. మేకప్ మ్యాన్ మంగయ్యది కూడా గుడివాడే కావడంతో అక్కినేనికి చక్కగా మేకప్ చేసి బాల్యంలో రాముడు ఇలాగే ఉండేవాడు కాబోలు అనేలా తీర్చి దిద్దారు. అలా అక్కినేని 8 మే నెల 1944న మైలాపూరులోని ప్రతిభా పిక్చర్స్ ఆఫీసులో అడుగిడి 68 ఏళ్ళపాటు తిరుగులేని నాయకుడిగా తెలుగు చలనచిత్రసీమను ఏలారు. 1944 నుంచి పూర్తి స్థాయిలో సినీ ప్రస్థానం ప్రారంభించిన అక్కినేని నాగేశ్వరరావుకు 1951 వరకూ నిర్మాత కావాలనే కోరిక లేదు. పి. ఆదినారాయణరావు, అంజలీదేవి, కె. గోపాలరావులు అక్కినేనిని కలుపుకొని ‘అశ్వనీ పిక్చర్స్’ అనే సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘మాయలమారి’ (1951) చిత్రాన్ని తెలుగు, తమిళ (మాయక్కారి)భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. అక్కినేని ప్రాభవానికి మూలాధారమైన దుక్కిపాటి మధుసూదనరావు సొంత సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే నిర్ణయానికి వచ్చారు.

అన్నపూర్ణా సంస్థ ఆవిర్భావం…
దుక్కిపాటి తల్లి చిన్నతనంలోనే కాలంచేస్తే మారుతల్లి అతణ్ణి పెంచి పెద్దచేసింది. ఆమె పేరు ‘అన్నపూర్ణ’. అక్కినేని నాగేశ్వరరావు చైర్మన్ గా, తను మేనేజింగ్ డైరెక్టరుగా సెప్టెంబరు 10, 1951న తన మారుతల్లి అన్నపూర్ణ పేరుతో “అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” అనే సినీనిర్మాణసంస్థను యేర్పాటు చేశారు. నవయుగ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు, టి.వి.ఎ. సూర్యారావు, కొరటాల ప్రకాశరావు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. కళాదర్శకులు టి.వి.యస్. శర్మ అజంతా శిల్పానికి ధీటుగా ఉండేలా ధాన్యలక్ష్మి రూపంలో వుండే చిహ్నాన్ని సంస్థ ‘లోగో’ గా తీర్చిదిద్దారు. భానుమతి భర్త రామకృష్ణ దర్శకత్వంలో తొలి సినిమా నిర్మిస్తే బాగుంటుందని దుక్కిపాటి, అక్కినేని, రామకృష్ణను సంప్రదించారు. కథా చర్చలు జరిగాయి. పదివేలు అడ్వాన్సు కూడా యిచ్చారు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన రామకృష్ణ తప్పుకొని తీసుకున్న పైకం వెనక్కి ఇచ్చేశారు. తరవాత బి.యన్. రెడ్డిని అడిగి చూశారు. ఫలితం లేకపోయింది. పి.పుల్లయ్య తొలుత అంగీకరించినా, శివాజి గణేశన్-సావిత్రి కాంబినేషన్ లో తెలుగులో విజయవంతమైన ‘అర్థాంగి’ సినిమాను ‘పెణ్ణయిన్ పెరుమై’ గా నిర్మించడంలో నిమగ్నుడై వుండడంతో అతనికి వీలుకాలేదు. అదేసమయంలో వాహినీ సంస్థతో తలెత్తిన మనస్పర్థల వలన దర్శకుడు కె.వి.రెడ్డి బయటకు వచ్చేశారు. ఇద్దరూ వెళ్లి కె.వి. రెడ్డిని కలిశారు. అప్పుడు కె.వి.రెడ్డి నిర్మాత, దర్శకుడుగా వాహినీ బ్యానర్ మీద ‘పెద్దమనుషులు’ చిత్ర నిర్మాణంలో బిజీగా వుండడంతో ఆ సినిమా నిర్మాణం పూర్తయ్యాకే అన్నపూర్ణావారి సినిమా చేస్తానని అన్నారు. అంతటి గొప్ప దర్శకునితో సినిమాతీస్తే అన్నపూర్ణా బ్యానర్ కు మంచి గుర్తింపు వస్తుందని భావించి కొంతకాలం ఆగేందుకు దుక్కిపాటి సమ్మతించారు. ఆ నిరీక్షణ చివరికి ‘పెద్దమనుషులు’(1954) సినిమా విడుదలయ్యేదాకా, రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే ఆ శ్రమ వృధా పోలేదు.

తొలిచిత్రం ‘దొంగరాముడు’…
‘పెద్దమనుషులు’ చిత్రానికి మాటలు రాసిన నరసరాజును రచయితగా పెట్టుకున్నారు. కథాచర్చలు ప్రారంభమయ్యాయి. ఆరునెలలు చర్చలు సాగాక ఒక కథ తయారయింది. అయితే ఆ కథ తొలిభాగం ఒకలాగా, ద్వితీయభాగం మరోలాగా వుందనిపించి, ఆ విషయాన్ని దుక్కిపాటి కె.వి. రెడ్డికి చెప్పారు. తొలిసారి సినిమా నిర్మిస్తూ మనసులో అలాంటి సందేహాలు ఉండకూడదని వేరేకథ కోసం చూద్డామన్నారు కె.వి. రెడ్డి. (అలా తిరస్కరింపబడిన కథనే తరవాత కె.వి. రెడ్డి జయంతి పిక్చర్స్ పతాకం మీద ‘పెళ్లినాటి ప్రమాణాలు’ పేరుతో సినిమాగా నిర్మించారు). మరో కథకోసం చర్చలు మొదలయ్యాయి. ఆ సమయంలో మద్రాసు మౌంటురోడ్డులోని ‘హిగ్గిన్ బాదమ్స్’లో ‘లవింగ్ బ్రదర్స్’ అనే ఆంగ్ల నవల మధుసూదనరావు కంటబడింది. అట్ట వెనుక వుండే కథను చదివారు. నవలలో ఇద్దరు అన్నదమ్ములుంటారు. అన్న దొంగతనాలు చేసి తమ్ముణ్ణి చదివిస్తాడు. తమ్ముడు ప్రయోజకుడయ్యేసరికి అన్న పోలీసులకు చిక్కుతాడు. తను దొంగ అనే విషయం తెలిస్తే తమ్ముడి ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని అన్న నిజాన్నిదాచి నోరు మెదపకుండా వుంటాడు. ఈకథాసారాంశo దుక్కిపాటికి నచ్చింది. వెంటనే నరసరాజు చేత ఆ నవల క్షుణ్ణంగా చదివించి కథకు రూపురేఖలు దిద్దారు. ‘లవింగ్ బ్రదర్స్’ లో తమ్ముడికోసం అన్న దొంగతనాలు చేయడం అనే పాయింటును మాత్రమే తీసుకొని సొంతంగా కథను అల్లారు. నవలలో తమ్ముడి పాత్రను చెల్లెలుగా మార్చి కథను రూపొందించారు (నరసరాజు రచించిన ‘రాముడు-భీముడు’ సినిమాకి లవింగ్ బ్రదర్స్ కథే స్పూర్తి). 1955 అక్టోబరు 2 గాంధి జయంతి నాడు ‘దొంగరాముడు’ సినిమా విడుదలై అద్భుత విజయాన్ని నమోదుచేసింది. అన్నపూర్ణా సంస్థకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాని తమిళంలోకి అనువదించి విడుదల చేస్తే, తమిళనాడులో ఆ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. తదుపరి చిత్రానికి కూడా కె.వి. రెడ్డినే దర్శకత్వం వహించమని దుక్కిపాటి కోరారు. కానీ విజయావారి ‘మాయాబజార్’ సినిమాకు పనిచేయాల్సిరావడంతో కె.వి. రెడ్డి తన అశక్తతను తెలియజేశారు.

అన్నపూర్ణా లోకి ఆదుర్తి…
విషయం తెలుసుకున్న నవయుగ ఫిలిమ్స్ అధినేత శ్రీనివాసరావు ఆదుర్తి సుబ్బారావు తొలిసారి దర్శకత్వం వహించిన ‘అమరసందేశం’ (1954) చిత్రాన్ని చూడవలసినదిగా దుక్కిపాటికి చెప్పారు. ఎస్. భావనారాయణ, డి.బి. నారాయణ సంయుక్తంగా నిర్మించిన ఆ చిత్రాన్ని దుక్కిపాటి చూశారు. హిందీ చిత్రం ‘బైజు బావరా’ స్పూర్తితో నిర్మించిన ‘అమరసందేశం’ సినిమా గొప్పగా ఆడకపోయినా, సినిమా చిత్రీకరించిన విధానం దుక్కిపాటికి నచ్చింది. అన్నపూర్ణా వారు నిర్మించబోయే రెండవ చిత్రానికి అలా ఆదుర్తి సుబ్బారావు దర్శకుడిగా నియమితులయ్యారు. తెలుగులో చక్రపాణి అనువదించిన శరత్ నవల ‘నిష్కృతి’ ని ఎంపికచేసి కథను కాస్త మార్చి ‘తోడికోడళ్ళు’ పేరుతో సినిమాగా నిర్మించారు. 1957 సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదలైన ‘తోడికోడళ్ళు’ ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడి అఖండ విజయం సాధించింది. అప్పటికే ‘దేవదాసు’, ‘లైలా మజ్ను’ తమిళ సినిమాలు విజయవంతమై నాగేశ్వరరావుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడం, కన్నాంబ, సావిత్రి, ఎస్. వి. రంగారావు కూడా తమిళ ప్రేక్షకుల ఆదరణ పొందివుండడంతో, ‘తోడికోడళ్ళు’ సినిమాను ఒకేసారి ‘ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి’ పేరుతో తమిళంలో కూడా నిర్మించి ఫిబ్రవరి 1 న విడుదల చేశారు. ఈ తమిళ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. ఆ చిత్రానికి తమిళ దర్శక నిర్మాత శ్రీధర్ సంభాషణలు రాశారు. ‘తోడికోడళ్ళు’ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది.

ఆదుర్తితో వరస విజయాలు…
అశాపూర్ణాదేవి బెంగాలీ నవల ‘అగ్నిపరీక్ష’ను బెంగాలీలో అగ్రదూత్ దర్శకత్వంలో అదేపేరుతో సినిమాగా నిర్మించారు. అందులో ఉత్తమ్ కుమార్, సుచిత్రాసేన్ ముఖ్య తారాగణం. ఎస్. భావనారాయణ దుక్కిపాటితో ‘అగ్నిపరీక్ష’ సినిమా చూడమని సలహా ఇచ్చారు. దుక్కిపాటికి ఆ సినిమా నచ్చడంతో హక్కులు కొని అదే సినిమాను తెలుగులో ‘మాంగల్యబలం’ పేరుతో సినిమాగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళంలో ‘మంజల్ మహిమై’ పేరుతో సమాంతరంగా నిర్మించారు. కన్నాంబ, సావిత్రి, రంగారావు, జి. వరలక్ష్మి, రాజసులోచన రెండు సినిమాల్లోనూ నటిస్తే, తమిళ వర్షన్ లో తంగవేలు, సారంగపాణి, బాలాజీ ఇతర పాత్రలు పోషించారు. ఊటీలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. తెలుగు వర్షన్ జనవరి 7, 1959 న విడుదల కాగా, తమిళ వర్ష ను తమిళుల పండుగ పొంగల్ కానుకగా 14, జనవరి 1959 న విడుదల చేశారు. తెలుగులో ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం తమిళంలో కూడా వంద రోజులకు పైగానే ఆడింది. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి తోబాటు ఫిలింఫేర్ బహుమతి కూడా లభించింది. కథాపరంగా, సాహిత్య సంగీత పరంగా, సాంకేతికపరంగా ఉత్తమ ప్రమాణాలతో సినిమాలు నిర్మిస్తారనే పేరు అన్నపూర్ణా సంస్థ దక్కించుకుంది.

ఆ సంస్థ మూడవ చిత్రం ఆదుర్తి దర్శకత్వంలో వచ్చిన ‘వెలుగు నీడలు’. ఈ చిత్రాన్ని కూడా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. తెలుగులో అక్కినేని, సావిత్రి, రంగారావు, జగ్గయ్య, రేలంగి, సూర్యకాంతం, రాజసులోచన, గిరిజ, పేకేటి, పద్మనాభం ముఖ్య తారాగణం కాగా, తమిళం చిత్రం ‘తూయ్ ఉళ్ళం’ లో ఇతర పాత్రలను తంగవేలు, బాలాజీ, ధర్మరాజ్, ఇ.వి. సరోజ, సుందరి బాయి, కమలాదేవి, సురభి కమలాబాయి పోషించారు. ‘శివాజీ గణేశన్ నిర్మించిన శాంతి థియేటర్ లో మొదట విడుదలైన చిత్రం ‘తూయ్ ఉళ్ళం’ కావడం విశేషం. తెలుగులో ఈ చిత్రం జనవరిన్ 7, 1961 న విడుదలై 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని అఖండ విజయం సాధించింది. అయితే తమిళ వర్షన్ విజయవంతం కాలేదు. కేవలం శాంతి థియేటర్ లో మాత్రం వందరోజులు ఆడింది. దాంతో అన్నపూర్ణా వారు తమిళంలో సినిమాలు నిర్మించడం విరమించుకున్నారు. తెలుగు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. ఈ చిత్రంలో శ్రీశ్రీ రచించిన “పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ తికా” అనే పాట ప్రతి స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లోను, గణతంత్ర దినోత్సవం నాడు తప్పకుండా వినపడుతూనే వుంటుంది. ఆత్మహత్యకు పాల్పడబోయిన ఒక యువకుడు శ్రీశ్రీ రచించిన “కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు” అనే పాటను ఆలకించి బ్రతుకు మీద ఆశ పెంచుకొని ఆత్మహత్యకు స్వస్తి చెప్పాడట.

అక్కినేని ద్విపాత్రాభినయంతో…
అన్నపూర్ణా పిక్చర్స్ వారి రెండు చిత్రాలు ఒకే సంవత్సరం విడుదలయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 7, 1961 న ‘వెలుగునీడలు’ విడుదల కాగా సంవత్సరాంతానికి అంటే 29 డిసెంబరు 1961 న ఇద్దరు మిత్రులు’ చిత్రాన్ని విడుదల చేశారు. 1957లో వచ్చిన బెంగాలి చిత్రం ‘తాషేర్ ఘర్’ ఆధారంగా ఆదుర్తి దర్శకత్వంలోనే ‘ఇద్దరుమిత్రులు’ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో వచ్చిన తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఇదే. ఆ రెండు పాత్రలను అక్కినేని పోషించగా, రాజసులోచన, ఇ.వి. సరోజ హీరోయిన్లు గా నటించారు. గుమ్మడి తేనెపూసిన కత్తిలాంటి విల్లన్ పాత్రను పోషించారు. ప్రముఖ నాటక రచయిత కొర్రపాటి గంగాధరరావును సంభాషణల రచయితగా, దాశరథిని పాటల రచయితగా ఈ చిత్రం ద్వారా దుక్కిపాటి పరిచయం చేశారు. ‘దొంగరాముడు’, ‘వెలుగునీడలు’ చిత్రాలకు పెండ్యాల, ‘తోడికోడళ్ళు’, ‘మాంగల్యబలం’ చిత్రాలకు మాస్టర్ వేణు సంగీతం సమకూర్చగా ‘ఇద్దరుమిత్రులు’ చిత్రం నుంచి సాలూరు రాజేశ్వర రావు అన్నపూర్ణా సంస్థకు ఆస్థాన సంగీతదర్శకుడిగా నియమించబడ్డారు. తరవాతి కాలంలో అన్నపూర్ణా సంస్థ నిర్మించిన ఎనిమిది సినిమాలకు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో సెల్వరాజ్ ఫోటోగ్రఫీకి అభినందనలు తెలపాలి. ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం ఆరు కేంద్రాల్లో వందరోజులు ఆది రజతోత్సవం కూడా చేసుకుంది.

‘ఇద్దరు మిత్రులు’ చిత్రం తరవాత దుక్కిపాటి మధుసూదనరావు ఆదుర్తి దర్శకత్వంలో ‘చదువుకున్న అమ్మాయిలు’ చిత్రాన్ని నిర్మించారు. డాక్టర్ శ్రీదేవి రచించిన ‘కాలాతీత వ్యక్తులు’ అనే నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. త్రిపురనేని గోపీచంద్ మాటలు రాశారు. హైదరాబాదులో వున్న వసతి సౌఖర్యాలను, ప్రతిభను సద్వినియోగం చేసుకొనే ఉద్దేశ్యంతో ముఖ్యపాత్రధారులైన సావిత్రి, కృష్ణకుమారి, ఇ. వి. సరోజ, సూర్యకాంతం, గుమ్మడి, రేలంగి, పద్మనాభం, శోభన్ బాబులను మినహాయిస్తే తక్కిన పాత్రలన్నీ స్థానిక కళాకారులను ఎంపికచేసి చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాదు సారథి స్టూడియోలో రికార్డింగ్, రీ-రికార్డింగ్ జరుపుకున్న తొలిచిత్రం ‘చదువుకున్న అమ్మాయిలు’. ఈ చిత్రం కూడా నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.

తొలి పూర్తి నవలాచిత్రం…
మనిషికి కావలసిన సహనం, మానవత, సహృదయత లేకుంటే తను నాశనమవటమే కాదు, ఇతరుల జీవితాలు కూడా నాశనం కావడానికి అతడు కారకుడౌతాడు. పశ్చాత్తాపమే దానికి ప్రాయశ్చిత్తం అనే సందేశాన్ని చాటుతూ అన్నపూర్ణా సంస్థ ఆదుర్తి దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డాక్టర్ చక్రవర్తి’. పూర్తి నిడివి నవలా చిత్రాన్ని తీయాలనే ఆలోచన దుక్కిపాటికి ఎప్పటినుంచో వుంది. 1962లో ఆంధ్రప్రభ వారు శుభకృత్ సంవత్సర ఉగాది నవలలపోటీ నిర్వహిస్తే కోడూరి కౌసల్యాదేవి నవల ‘చక్రభ్రమణం’కి ప్రధమ బహుమతి లభించింది. న్యాయనిర్ణేతల సంఘంలో సభ్యుడుగా వ్యవహరించిన దుక్కిపాటి స్నేహితుడు త్రిపురనేని గోపీచంద్ ఈ నవలను సినిమాగా తీస్తే పూర్తి స్థాయి నవలా చిత్రాన్ని తీయాలనుకుంటున్న ఆశయం కూడా నెరవేరుతుందని సలహాయిచ్చి, ఆ నవల హక్కులు కొనమన్నారు. అయితే దుక్కిపాటి నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరిగింది. ఈలోగా ఆ నవల మార్కెట్లో విడుదలై విపరీతమైన జనాదరణ పొందింది. పాఠకులు దానిని సినిమాగాతీస్తే యేయే నటీనటులు ఆయా పాత్రలకు సరిపోతారో సూచిస్తూ అన్నపూర్ణా సంస్థకు అసంఖ్యాకంగా ఉత్తరాలు రాశారు. అప్పుడు దుక్కిపాటి రాజమండ్రి వెళ్లి ఆ నవల హక్కుల్ని కొని, కౌసల్యాదేవినే సినిమాకి సంభాషణలు రాయవలసిందిగా కోరారు. ఇరవై యేళ్ళుకూడా నిండని ఆమెను మద్రాసు పంపడం ఇష్టంలేదని ఆమె తల్లిదండ్రులు తేల్చిచెప్పడంతో, ఆచార్య ఆత్రేయతో మాటలు రాయించారు. సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా వుండాలని కౌసల్యాదేవే ఈ సినిమాకి ‘డాక్టర్ చక్రవర్తి’ అనే పేరును సూచించారు. చక్రభ్రమణం నవల ధారావాహికంగా వెలువడినప్పుడు ఆంధ్రప్రభలో సబ్-ఎడిటరుగా పనిచేసిన గొల్లపూడి మారుతీరావుకు ఆ నవల గురించి సంపూర్ణ అవగాహన వుండటం చేత, స్క్రీన్ ప్లే బాధ్యతలు అతనికి అప్పజెప్పారు. స్క్రీన్ ప్లే రచనలో కె.విశ్వనాధ్, ఆదుర్తి, దుక్కిపాటి కూడా పాలుపంచుకున్నా, మారుతీరావు ప్రతిభను ప్రోత్సహించాలని టైటిల్ కార్డులో ఆయనపేరు మాత్రమే వేశారు. అప్పట్లో హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తున్న మారుతీరావు సినీప్రస్థానం ఈ సినిమాతోనే మొదలైంది. ‘చక్రభ్రమణం’వంటి జనాదరణ పొందిన నవలను సినిమాగా మలచటం అంత సులువు కాదు. “నవలకు చిత్రరూపం యెలాయిచ్చారు” అనే ఆసక్తి పాఠకుల్లో వుంటుంది. రచయిత పేజీలకొద్దీ రాసే వాటిని డైలాగులుగా వాడలేరు. అందుకే సినిమాపరంగా నవలలోని సంభాషణలకు గణనీయమైన మార్పులు చేశారు. ‘చక్రభ్రమణం’ నవలలో చక్రవర్తి పాత్రను ఒక ధనవంతుడిగా సృష్టిస్తే, సినిమాలో ఆ పాత్రను ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, చెల్లెలి భర్త సహాయంతో విదేశాలలో చదువుకున్నవాడిలా మార్చారు. నవలలో భర్త సంకుచిత మనస్తత్వానికి బలైపోయిన సుధ పాత్రను, సంపన్న కుటుంబ మహిళగా, ఆమె భర్తను సహృదయునిగా, ఆమె మరణం క్యాన్సర్ ముదిరిన కారణంగా జరిగిన ఘటనగా మార్చారు. నవలలో సుధ ఎవరనేది చివరిదాకా సస్పెన్స్ లో సాగి ఆమె ఎవరన్నది ఆఖరున తెలుస్తుంది. కానీ సినిమాలో ఆ సస్పెన్స్ వుండదు. అందుకే నవలాచిత్రాలు తీయటం, మెప్పించటం కత్తిమీద సాము వంటిది. ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాని ఆనాటి మమతానుబంధాలకు అద్దంపట్టిన ఉదాత్తమమైన కథగామలిచి సెల్ల్యూలాయిడ్ మీదకు ఎక్కించారు. సినిమాలో మాధవిగా నటించిన సావిత్రి పాత్ర అద్వితీయం.. సావిత్రి అన్నపూర్ణా సంస్థలో నటించిన ఆఖరి చిత్రం డాక్టర్ చక్రవర్తి. అలాగే షావుకారు జానకి ఈ సంస్థలో నటించిన మొదటి సినిమా కూడా డాక్టర్ చక్రవర్తే! జగ్గయ్య తండ్రి జగన్నాథరావుగా నాటి హిందూస్తాన్ ఐడియల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ జనరల్ మేనేజరుగా పనిచేస్తున్న సంగమేశ్వరరావు, గీతాంజలి భర్త శేఖర్ గా సికింద్రాబాద్ నవయుగ ఫిలింస్ పంపిణీ సంస్థ మేనేజరు మురళీకృష్ణ నటించడం విశేషం. స్థానిక రంగస్థల నటులను ప్రోత్సహించాలని భానుప్రకాష్ కు ఇందులో చిన్నపాత్ర ఇవ్వటం జరిగింది. ఇదే భానుప్రకాష్ చేత తరవాత వచ్చిన ‘పూలరంగడు’ చిత్రంలో విలన్ పాత్రను పోషింపజేశారు. తెలుగులో నిర్మించిన తొలి నవలా చిత్రంగా గణుతికెక్కిన ఈ సినిమా 10, జూలై 1964న విడుదలై విజయడంకా మోగించింది. 1964లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చలన చిత్రాలకు నంది అవార్డులను ప్రవేశపెట్టింది. ప్రధమ బహుమతిగా తొలి బంగారు నంది పురస్కారం ఈ చిత్రానికే దక్కింది. అంతేకాదు 1964 సంవత్సరానికి ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చలన చిత్రంగా ఎన్నికై రాష్ట్రపతి రజత పతాకాన్ని గెలుచుకుంది.

దర్శకుడిగా విశ్వనాథ్…
అన్నపూర్ణా చిత్రాలకు సహకార దర్శకుడిగా పనిచేసిన విశ్వనాథ్ పనితనం గమనించిన దుక్కిపాటి అన్నపూర్ణా సంస్థలోకి ఆహ్వానించి, దర్శకత్వశాఖలో రెండేళ్ళు పనిచేశాక సొంతంగా దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం “డాక్టర్ చక్రవర్తి” సినిమా తర్వాత దుక్కిపాటి ‘ఆత్మగౌరవం’ (1965) సినిమాకు దర్శకత్వ పగ్గాలు విశ్వనాథ్ కు అప్పగించారు. గొల్లపూడి మారుతీరావు ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణితో కలిసి ‘ఆత్మగౌరవం’ సినిమాకు కథను సమకూర్చారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని ఇటీవల అమెరికాలో మరణించిన ప్రముఖ నృత్య కళాకారిణి డా|| సుమతీ కౌశల్ ను నృత్యదర్శకురాలిగా పరిచయం చేశారు. ఆకాశవాణి నాటక విభాగంలో పనిచేసే ఛాయాదేవి చేత కామాక్షమ్మ పాత్రను, ప్రకటనల విభాగంలో వ్యాఖ్యాతగా వ్యవహరించే వెంపటి రాధాకృష్ణ చేత పురోహితుడు శాస్త్రి పాత్రను పోషింపజేసి స్థానిక కళాకారులను ప్రోత్సహించిన గౌరవం అన్నపూర్ణ సంస్థకే దక్కింది. సినిమా శతదినోత్సవం చేసుకుంది. గొల్లపూడికి రాష్ట్ర నంది బహుమతి లభించింది. తరవాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘పూలరంగడు’ (1967) చిత్రం నిర్మించారు. హిందీ చిత్రం ‘కాలాపానీ’ ఈ సినిమాకు స్పూర్తి. ముళ్ళపూడి రచన చేయగా, ముప్పాళ్ళ రంగనాయకమ్మ సంభాషణలు కూర్చారు. స్థానిక కళాకారుడు భానుప్రకాష్ ని విలన్ గా పరిచయం చేశారు. ఈ సినిమా 11 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. తరవాత యోగానంద్ దర్శకత్వంలో ‘జై జవాన్’ (1970) నిర్మించారు. చిత్రం విజయవంతం కాలేదు. దీనికి ముందు దుక్కిపాటి నిర్మాతగా సారథి స్టూడియో సంస్థ ‘ఆత్మీయులు’ (1969) సినిమా నిర్మించింది. తరవాత అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్, అన్నపూర్ణా కళానికేతన్ పేర్లతో ‘విచిత్రబంధం’, ‘బంగారుకలలు’, ‘ప్రేమలేఖలు’, ‘రాధాకృష్ణ’, ‘పెళ్లీడు పిల్లలు’ ‘అమెరికా అబ్బాయి’ చిత్రాలు దుక్కిపాటి నిర్మించారు. దుక్కిపాటి మొత్తం 22 చిత్రాలు నిర్మించారు. అందులో 16 సినిమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బహుమతులు అభించాయి. 1994లో దుక్కిపాటి మధుసూదనరావు సినీపరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా రాష్ట్రప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారంతో సత్కరించింది. ఆ బహుమతి మొత్తం యాభైవేల రూపాయలను తమ సంస్థ తొలి చిత్రం ‘దొంగరాముడు’ కు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి స్మారక నిధి కోసం తిరిగి ప్రభుత్వానికే సమర్పించి ప్రతి యేటా కె.వి.రెడ్డి పేరిట ఉత్తమ దర్శకునికి స్వర్ణ పతకాన్ని బహుమతిగా అందజేయమని దుక్కిపాటి కోరారు. 88 సంవత్సరాల వయసులో మార్చి 26, 2006 న దుక్కిపాటి హైదరాబాడులో మరణించారు.

-ఆచారం షణ్ముఖాచారి

Related posts