telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాస్యానికి కొత్త భాష్యం అల్లు రామలింగయ్య

Allu-Ramalingaiah

తెలుగులో జానపద, పౌరాణిక చిత్రాలకు ఆదరణ తగ్గిన తర్వాత ఎక్కువగా సాంఘిక చిత్రాల నిర్మాణం జరిగింది. అదే రోజుల్లో రాజమహేంద్రవరానికి చెందిన గరికిపాటి రాజారావు వైద్యవృత్తిలో ఉంటూ ప్రజా నాట్యమండలి కార్యక్రమాలలో, నాటకాల్లో చురుగ్గా పాల్గొంటూ వుండేవారు. ఆయన సమాజానికి మంచి సందేశాన్ని అందించే సినిమా నిర్మించాలని 1953లో ‘‘పుట్టిల్లు’’ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా ద్వారా ప్రఖ్యాత నటీమణి జమునతోబాటు మరొక నటుడు కూడా కొత్తగా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. ఆయనే హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య. రేలంగి తర్వాత పద్మశ్రీ పురస్కారం అందుకున్న రెండవ హాస్యనటుడు ఆయనే. గొప్ప మానవతావాది కూడా. జూలై 31, 2004న కన్నుమూశారు. ఈరోజు అల్లు రామలింగయ్య (జులై 31) వర్ధంతి. ఈ సందర్భంగా హాస్యానికి కొత్త భాష్యం చెప్పి, నవ్వుల గుండెల్లో కొలువుంటానని చాటిచెప్పిన రామలింగయ్య గురించి కొన్ని జ్ఞాపకాలు…

Allu

పాలకొల్లు నుంచి ప్రస్థానం…
అల్లు రామలింగయ్య పుట్టింది 1922 అక్టోబరు 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో. తండ్రి వెంకయ్యకి ఏడుగురు సంతానం. వారిలో రామలింగయ్య నాలుగవ సంతానం. రామలింగయ్యకు ఒకే ఒక ఆడపడుచు సత్యవతి. పాలకొల్లులోని పంచ ఆరామాలలో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా ఈ నాలుగవ బిడ్డకు రామలింగయ్య అని పేరు పెట్టుకుంది ఆయన తల్లి సత్తెమ్మ. రామలింగయ్యకు ఆట్టే చదువు సంధ్యలు అబ్బలేదు. ఎప్పుడూ ఆకతాయి కుర్రాడిలా తిరిగేవారు. ఆట పాటలతోబాటు తన సహచరులను సరదాగా నవ్విస్తూ వుండేవారు. నాటకాలను బాగా చూసేవారు. నాటకాల కంపెనీలు ఊరూరా తిరుగుతూ ఉండేవి. ఆ కంపెనీ మేనేజర్ల చుట్టూ తిరుగుతూ నాటకాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు. ఒకసారి ‘భక్త ప్రహ్లాద’ అనే నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. ఆ వేషాన్ని అదురూ బెదురూ లేకుండా రక్తి కట్టించారు రామలింగయ్య. మొదట డబ్బులు ఎదురిచ్చి నాటకాల్లో వేషాలు సంపాదించడంతో రామలింగయ్య నట జీవితం మొదలైంది. గాంధీజీ 1942లో ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమానికి పిలుపిచ్చే సమయానికి రామలింగయ్యకు ఇరవై ఏళ్ళు. సామాజిక బాధ్యతను గుర్తించిన రామలింగయ్య యువతను ఉత్తేజపరచి ఆ ఉద్యమంలో చురుగా పాల్గొని రాజమండ్రి జైలుకెళ్లారు. అక్కడ కూడా తన సహచర సమరయోధుల్ని నవ్విస్తూ చిన్న చిన్న నాటకాలు వేస్తూ, బుర్రకథలు చెబుతూ అందరికీ వినోదం పంచేవారు. జైలు నుంచి విడుదలయ్యాక కమ్యూనిస్టు వారితో చేరి స్వాతంత్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడే గరికిపాటి రాజారావుతో ఆయనకు పరిచయమైంది.

Allu

సినిమాల్లోకి ప్రవేశం…
రామలింగయ్యకు సినిమాల్లో నటించాలనే కోరిక బలీయమైంది. అప్పటికే రామలింగయ్యకు కనకరత్నంతో వివాహమై నలుగురు సంతానం. రాజమండ్రి పట్టణానికి చెందిన డాక్టర్‌ గరికిపాటి రాజారావు 1952లో ‘పుట్టిల్లు’ అనే సాంఘిక సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు రామలింగయ్య అందులో వేషం కోసం ప్రయత్నించారు. అతని ప్రయత్నం ఫలించి అందులో నటించే అవకాశం రావడంతో భార్యా పిల్లలతో మద్రాసు పయనమయ్యారు. ఆ చిత్రం నిర్మాణ దశలో రామలింగయ్య ఉదరపోషణ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే హోమియో వైద్యం మీద దృషి పెట్టి ఆ విద్యను నేర్చుకున్నారు. ఆ వైద్యంతో సంసారాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘పుట్టిల్లు’ సినిమా పూర్తి విడుదలైంది. కానీ ఆ సినిమా అపజయాన్ని చవిచూడడంతో రామలింగయ్యకు పెద్దగా అవకాశాలు రాలేదు. ‘పుట్టిల్లు’ చిత్రంలో నటించాక నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ‘మాస్టర్‌ బద్దంకి’ అనే పాత్రలో నటించే అవకాశం దొరికింది. ఎన్‌.టి. రామారావు, జానకి నటించిన ఈ చిత్రం 1954లో విడుదలై విజయవంతం కావడంతో రామలింగయ్యకు నటుడిగా గుర్తింపు వచ్చింది. ధైర్యం కోల్పోకుండా చిత్రసీమనే నమ్ముకొని ఎలాంటి పాత్ర వచ్చినా అందులో రాణిస్తూ తనదైన ముద్ర వేసేందుకు రామలింగయ్య బాగా కష్టపడ్డారు. బోళ్ళ సుబ్బారావు నిర్మించిన ‘పల్లెపడుచు’ (1954) చిత్రంలో నటించాక రామలింగయ్యకు విజయావారి ‘మిస్సమ్మ’, అన్నపూర్ణావారి ప్రధమ చిత్రం ‘దొంగరాముడు’ సినిమాలలో అవకాశం చిక్కింది. నిష్ణాతులైన ఎల్‌.వి.ప్రసాద్, కె.వి. రెడ్డి వంటి దర్శకుల వద్ద పనిచేయడం రామలింగయ్యకు లాభించిన అంశం.

ఆ తర్వాత భరణీ వారి ‘వరుడు కావాలి’, బి. ఎన్‌. రెడ్డి ‘భాగ్యరేఖ’ సినిమాలు రామలింగయ్యకు జీవం పోశాయి. 1960లో అల్లు రామలింగయ్య చిత్రసీమలో నిలదొక్కుకొని హాస్యపాత్రలు, హాస్యంతో కూడిన విలన్‌ పాత్రలు పోషిస్తూ మంచి మంచి విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ పేరు గడించారు. మాయాబజార్, మూగమనసులు, ముత్యాలముగ్గు, మనవూరి పాండవులు, శంకరాభరణం, అందాలరాముడు, బుద్ధిమంతుడు, ప్రేమించి చూడు వంటి సినిమాలలో రామలింగయ్యకు అద్భుతమైన పాత్రలు దొరకడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన లేని సినిమాలు బహు అరుదుగా ఉండేవి. తెలుగు మహాసభల కోసం నటీనటులు నాటకాలు వేస్తూ మూడు బస్సుల్లో మద్రాసులో బయలుదేరి చివరగా విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడే రామలింగయ్యకు వార్త తెలిసింది, ఎంతో చలాకీగా వుండే తన రెండవ కుమారుడు అల్లు వెంకటేశ్వర్లు ఎలెక్టిక్రల్‌ రైలు ప్రమాదంలో మరణించాడని. వెంటనే అల్లు మద్రాసు ప్రయాణం కట్టారు. వెంకటేశ్వర్లు బాపు−రమణల ‘సాక్షి’ చిత్రంలో చలాకీ పాత్ర ధరించాడు కూడా. ఈ సంఘటన జరిగినప్పుడు ‘ముత్యాలముగ్గు’ చిత్ర షూటింగు ముమ్మరంగా సాగుతోంది. అందులో రామలింగయ్యది ప్రధాన పాత్ర కావడంతో షెడ్యూలుకు తన వలన నష్టం రాకూడదని, బాధను దిగమింగుతూ చిత్రీకరణలో పాల్గొన్న నిజమైన నటుడు రామలింగయ్య. ఆయన మొత్తం మీద 1030 సినిమాలలో నటించి రికార్డు సృష్టించారు. ‘‘అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ’’ ‘‘ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా’’ ‘‘ఆడించు ఆడించు జోరుగా’’ ‘‘ఎట్లా పుడతారే పిల్లలు ఎట్లా పుడతారే… ఆమ్యాంమ్యాంమ్యాంమ్యాం’’ వంటి అల్లు మార్కు పాటలు నేటికీ నిత్యనూతనాలే.

Allu

ప్రభుత్వ సత్కారాలు.. అల్లు సంస్థలు…
రామలింగయ్య సుదీర్ఘకాలం ప్రేక్షకులను నవ్విస్తూ, హాస్యంతో కూడిన విలనీలో రాణిస్తూ, క్యారక్టర్ పాత్రలు పోషిస్తూ చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1990లో ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందజేసింది. 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’అవార్డుతో రామలింగయ్యను సత్కరించింది. ఆయన కాంస్య విగ్రహాన్ని సొంతవూరు పాలకొల్లులోను, విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ రోడ్డులోను ప్రతిష్టించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారత తపాలా శాఖ అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. నృత్య కళామండలి వారు రామలింగయ్యకు ‘‘హాస్య కళా ప్రపూర్ణ’’ అనే బిరుదు ప్రసాదించారు. రాజమహేంద్రవరంలో అల్లు రామలింగయ్య పేరుతో ఒక హోమియో కళాశాల నెలకొల్పారు. రామలింగయ్య నిర్మాతగా మారి 1972లో ‘గీతా ఆర్ట్స్’’ సంస్థను నెలకొల్పారు. ’బంట్రోతు భార్య’, ‘దేవుడే దిగివస్తే’, ‘బంగారు పతకం’ వంటి చిత్రాలు నిర్మించారు. తర్వాత కుమారుడు అల్లు అరవింద్‌ తండ్రి ప్రస్థానం కొనసాగిస్తూ మంచి సినిమాలతోబాటు, పంపిణీ సంస్థను కూడా వృద్ధిచేసి ఇప్పుడున్న నిర్మాతలకు తలమానికంగా నిలిచారు. ‘విజేత, ‘పసివాడి ప్రాణం’, ‘మెకానిక్‌ అల్లుడు’, ‘మాస్టర్‌’, ‘డాడీ’ వంటి చిత్రాలను బావ చిరంజీవితో నిర్మించి విజయవంతమైన నిర్మాతగా స్థిరపడ్డాడు. యాభైకి పైగా చిత్రాలు నిర్మించాడు. హిందీ చిత్రసీమలో ప్రవేశించి ప్రతిబంధ్, మేరే సప్నోంకి రాణి, ది జంటిల్మన్, గజని వంటి సినిమా నిర్మించారు. తమిళ, కన్నడ సినిమాలు కూడా నిర్మించి సత్తా చాటుకున్నారు. రామలింగయ్య మనవళ్ళు, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ కూడా యువ హీరోలుగా రాణిస్తున్నారు. అల్లు రామలింగయ్య సినీ ప్రస్థానం అలా మూడుపువ్వులు ఆరు కాయలుగా విస్తరించి అల్లు వంశాన్ని సుస్థిరం చేసింది. తన 82వ ఏట మనవడు అల్లు అర్జున్‌ హీరోగా ఎదుగుతున్న ఉచ్చదశను వీక్షిస్తూ జూలై 31, 2004న రామలింగయ్య కన్నుమూశారు. మరణానంతరం తన కళ్ళను దానం చేశారు.

ప్రత్యేకతలు, విశిష్టతలు…
రామలింగయ్యకు సినిమాల్లో కొన్ని విచిత్ర సంభాషణలున్నాయి. వేటగాడు (1973)లో తేయాకు ఎస్టేటులో పనిచేసే మమతతో ‘‘నిన్ను చూస్తుంటే నాకోరకమైన ‘అప్పుం’ కలుగుతావుంది’’ అంటారు. అలాగే ‘అందాలరాముడు’ సినిమాలో తీసేసిన తాసీల్దారు (తీతా) పాత్రలో లంచానికి ‘‘ఆమ్యామ్యా’’ అని పేరుపెట్టి వసూలు చేస్తుంటారు. మరో సినిమాలో రావు గోపాలరావుతో ‘‘ఏవండోయ్‌ నన్ను అనుమానించారంటే సీతాదేవిని అనుమానించినట్లే’’ అంటారు. ‘ముత్యాలముగు’లో కోడలు గారి సెండాఫ్‌ నగలు, జవహరీ, దేవుడి నగలు కాజేసినందుకు కోతి చేష్టలు చేసే తెలివితక్కువ వానిగా ప్రవర్తిస్తూ అచ్చం కోతి లాగే ప్రదర్శించే జోగినాధం పాత్రలో ఆయన నటన చాలా గొప్పగా ఉంటుంది. ‘యమగోల’.చిత్రంలో చిత్రగుప్తుడిగా అద్భుత నటన ప్రదర్శించారు. ‘మాయాబజార్‌’ సినిమాలో వంగరతో కలిసి తాన శర్మ, తందాన శాస్త్రులుగా గొప్ప వినోదాన్ని పంచారు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్‌ మాడ్యులేషన్‌ ప్రధానమని నమ్మి వాటితోనే తనదైన శైలిని అల్లు సృష్టించుకున్నారు. అదే రామలింగయ్య ఆస్తి అని చెప్పవచ్చు. రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, రాజబాబు, నూతన ప్రసాద్, నాగేష్, బ్రహ్మానందం లతో అల్లు రామలింగయ్య పండించిన హాస్యం అద్భుతం. శంకరాభారణంలో శంకర శాస్త్రికి అత్యంత సన్నిహిత మిత్రుడుగా ఒకవైపు హాస్యాన్ని ఒలికిస్తూనే సీరియస్‌ పాత్రను పోషించడం రామలింగయ్య ప్రతిభకు గీటురాయి. ‘సప్తపది’, ‘సాగరసంగమం’ సినిమాలలో పాత్రలు కూడా ఉదాత్తమైనవే.

Allu

కొన్ని విశేషాలు…
★ అల్లు రామలింగయ్య పాలకొల్లులో వున్నప్పుడు ఒకసారి వాళ్ల అన్న, అత్తగారింటికి వెళ్లారు. ఆ ఇంటి యజమానికి ఒక గుర్రం వుండేది. ఆ గుర్రం మీద రామలింగయ్య అన్నయ్య, మామ స్వారీ చేస్తుండేవారు. అల్లు వెళ్లినప్పుడు ఆయన లేరు. గుర్రం వుంది. ఎలాగు గుర్రం ఖాళీగా ఉందికదా, సరదాగా స్వారీ చేద్దామని ఓ నలుగురు కుర్రాళ్లను పోగేసి గుర్రాన్ని నడిపించుకుంటూ వూరవతలవున్న తోటలోకి బయల్దేరారు. అల్లు గుర్రం మీద కూర్చుంటే ఆ కుర్ర గ్యాంగు ఆ గుర్రాన్ని నడిపించే ప్రయత్నం చేశారు. అర అడుగు కూడా అది ముందుకు వెయ్యలేదు. అక్కడున్న కొందరు పెద్దలు ఆ యజమాని ఎక్కితే కానీ కదలదు అని చెప్పారు. కానీ కుర్రాళ్లు మాత్రం ఖాతరు చెయ్యకుండా అల్లుని గుర్రమెక్కించి రెండు కాళ్లూ వదులుగా పెట్టి, రెండు చేతులూ పైకెత్తి, కళ్లు మూసుకోమని సలహాయిచ్చి, గుర్రం బయలుదేరగానే కళ్ళెం పట్టుకోమన్నారు. అల్లు వాళ్లు చెప్పినట్లే చేశారు. ఆ కుర్రాళ్లు గుర్రం కాళ్ల మీద ఓ చువ్వ తీసుకొని బలంగా బాది ‘‘చలో’’ అన్నారు. గుర్రం ఒక్క ఉదుటున వూపందుకుంది, అల్లుని కిందకు విసిరేస్తూ. వీపు విమానం మోత మోగింది. దాంతో మూడ్రోజులుండిపోవాలనుకున్న అల్లు ముప్పై రోజులదాకా అక్కడ నుంచి కదలలేకపోయారు.

★ ‘ప్రేమించి చూడు’ సినిమా షూటింగు హైదరాబాద్‌ సారథి స్టూడియోలో జరుగుతోంది. రేలంగికి అప్పటికే పద్మశ్రీ వచ్చి మంచి ఉచ్చదశలో వున్నారు. ఒక సన్నివేశంలో గుమ్మడి, రేలంగి, అల్లు రామలింగయ్య నటించాలి. కథానుసారం పాత్రల బాంధవ్యాన్ని బట్టి ఆ దృశ్యంలో అల్లు, రేలంగిని ‘‘బావా’’ అని పిలిచారు. వెంటనే రేలంగికి కోపం వచ్చింది. ‘‘ప్రతి అడ్డమైన వాడూ నన్ను ‘బావా’ అని పిలవడమేమిటి’’ అంటూ అభ్యంతరం చెప్పారు. పాపం రామలింగయ్య మొహం చిన్నబోయింది. గుమ్మడి రేలంగిని అనునయిస్తూ అలా మాట్లాడడం తప్పని, పాత్రల ప్రకారమే వ్యవహరించాలని హితవు పలికారు. వెంటనే రేలంగి అల్లుకి సారీ చెప్పారు.

Allu

★ ఒకసారి నిర్మాత రామానాయుడు ‘పాపకోసం’ సినిమా షూటింగు మంచి ఎండాకాలం మద్రాసుకు సమీపంలో వుండే మహాబలిపురం వద్ద ప్లాన్‌ చేశారు. అందులో అల్లు రామలింగయ్యది ఒక బ్రాహ్మణుడి వేషం. ఉదయం షెడ్యూలు పూర్తయ్యాక భోజనాలు వచ్చాయి. తృప్తిగా భోజనాలు ముగిశాయి. రామలింగయ్య తన షాటు ఎప్పుడొస్తుందని దర్శకుణ్ణి అడిగారు. ‘‘మేం పిలుస్తాం. మీరు రెస్టు తీసుకోండి’’ అని దర్శకుడు చెప్పడంతో కాస్త కునుకు తీద్దామని దిండు తీసుకొని దూరంగా వున్న ఒక చెట్టు నీడలో సేదతీరెందుకు వెళ్లారు. బాగా నిద్ర పట్టింది. నాలుగింటికి షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పి ఎవరికి దొరికిన కార్లలో వాళ్లు వెళ్లిపోయారు, పాపం రామలింగయ్యను పట్టించుకోకుండా. మెలకువ వచ్చిన రామలింగయ్య చడీచప్పుడూ లేకపోవడంతో అక్కడ బట్టలుతుకుతున్న ఒకబ్బాయిని అడిగారు. అందరూ ఎప్పుడో వెళ్లిపోయారనే కబురు ఆ కుర్రాడు చెప్పగానే రామలింగయ్య కంగారు పడ్డారు. ఈలోగా ప్రొడక్షన్‌ కార్లన్నీ ఆఫిసుకు చేరాయి. ‘‘రామలింగయ్య ఏ కారులో ఎక్కారు’’ అని ప్రొడక్షన్‌ మేనేజర్ని అడిగితే అతడు నాలుక్కరచుకున్నారు. వెంటనే కారు పంపితే, మహాబలిపురం బస్టాండు వద్ద మేకప్‌లో వున్న అల్లు కనిపించారు. బ్రతుకుజీవుడా అంటూ రామలింగయ్య ఆ కారెక్కి ఇల్లు చేరుకున్నారు. ‘నిద్ర సుఖం అలాంటిది’ అంటూ అల్లు చమత్కరిస్తూ వుండేవారు.

-ఆచారం షణ్ముఖాచారి

Related posts