గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో వానలు దంచి కొడుతున్నాయి. రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి.
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుండపోత వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతి నిధులు, పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అత్యధికంగా నడికుడలో 14.5, సంగెంలో 14.4 సెం.మీ, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్‌లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. 28 కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల వద్దకు వెళ్లిపోతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, జగిత్యాల, జనగామ, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో పలు జిల్లాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాద్రి జిల్లా కేంద్రం లో రైల్వే అండర్‌బ్రిడ్జి వరకు వరద ప్రవహించింది. సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
నీట మునిగిన పంట
పాల్వంచ గుట్ట సమీపంలో ఓ చిన్నారి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయి మృతిచెందింది. బోనకల్, జూలూరుపాడు, ఖమ్మం రూరల్, వైరా, కొణిజర్ల ప్రాంతాల్లో పత్తి, వరిచేలు నీటమునిగాయి.
ఈరోజు కూడా వానలే
వాయువ్య, తూర్పు- మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ చెప్పారు.
వైద్యారోగ్య శాఖ అప్రమత్తం
వరద ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వరద నీటిలో మునిగిన బస్తీలు, కాలనీల్లోని ప్రజలకు దగ్గు, జ్వరం, జలుబు తదితర లక్షణాలు ఉన్నట్టు తేలితే వెంటనే వైరల్ ఫీవర్లు, కరోనా టెస్టులు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
వరంగల్ & హనుమకొండ కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ 915452937, 1800 425 3424. హనుమకొండ లో 1800 425 1115 టోల్ ఫ్రీ నెంబర్లు..
మోదీ దేశానికి ప్రధానిమంత్రేనా..? – రేవంత్‌రెడ్డి ఫైర్