telugu navyamedia
క్రీడలు వార్తలు

కోల్‌కత జట్టులో కరోనా రావడానికి కారణం అతడేనా..?

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తీ కరోనా బారిన పడ్డారు. దాంతో నేడు(సోమవారం) ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా అధికారికంగా ధృవీకరించింది. అయితే అత్యంత కఠినమైన బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు బబుల్‌లోకి వైరస్ ఎలా ప్రవేశించిందనే విషయం అంతుపట్టడంలేదు. బీసీసీఐ కఠిన ప్రొటోకాల్స్ నేపథ్యంలో బయో బబుల్‌లోకి వైరస్ ప్రవేశించడం దాదాపు అసాధ్యం. అసలు ఈ లీగ్‌లో పాలుపంచుకునే మైదాన సిబ్బంది నుంచి టీవీ క్రూ, హోటల్ సిబ్బంది వరకు అందరూ కఠిన బబుల్‌లోనే ఉంటారు. అలాంటప్పుడు వైరస్ ఎలా వచ్చిందనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే వరుణ్ చక్రవర్తీ బయో బబుల్ ధాటినట్లు ప్రచారం జరుగుతోంది. భుజ గాయానికి స్కానింగ్ తీసేందుకు వరుణ్ బబుల్ వీడి ఆసుపత్రికి వెళ్లినట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో పేర్కొంది. అక్కడే అతనికి వైరస్ సోకినట్లుందని ప్రచారం జరుగుతుంది. ఇక బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో గత నాలుగు రోజుల్లో చేసిన మూడో పరీక్షల్లో వరుణ్‌, సందీప్ వారియర్‌కు పాజిటీవ్ వచ్చినట్లు పేర్కొంది. దాంతో ఈ ఇద్దరిని ఐసోలేషన్‌కు తరలించినట్లు స్పష్టం చేసింది. వైద్యుల బృదం నిరంతరం వారిని పర్యవేక్షిస్తుందని, వారితో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లను కూడా వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపింది. వరుణ్ చక్రవర్తి కేకేఆర్ జట్టుతో కలిసి ఉండటంతో వైరస్ ఎంతమందికి వ్యాప్తి చెందిందనే ఆందోళన అందరి నెలకొంది.

Related posts