telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో .. 29న ప్రారంభం..

rayadurgam metro line starts on 29th

ఇప్పటివరకు నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు నడిచిన మెట్రో మిగిలిన హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు రాకపోకలు సాగించనుంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి దీనికి సంబంధించిన రాకపోకలను నవంబర్ 29న పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం( మైండ్‌స్పేస్) వరకు 1.5 కిలోమీటర్ల పొడవైన మార్గం అందుబాటులోకి రావడం ద్వారా ఐటీ నిపుణులు, ఉద్యోగులు సులభంగా ప్రయాణించొచ్చు. ఇప్పటివరకు హైటెక్‌సిటీ వరకు మాత్రమే మెట్రో అందుబాటులో ఉండటంతో వీరు గమ్యస్థానాలకు చేరడానికి ఫీడర్ సర్వీసులను మెట్రోస్టేషన్ల నుంచి పనిచేసే సంస్థల వరకు రాకపోకలు సాగించడానికి వినియోగించుకుంటున్నారు.

ఈ మార్గం అందుబాటులోకి రావడం ద్వారా మైండ్‌స్పేస్ జంక్షన్ వరకు ఉన్న ఐటీ కంపెనీలకు మెట్రో కనెక్టివిటీ పెరుగుతుంది. దీనికి సంబంధించి తనిఖీలను శుక్రవారం హైదరాబాద్ మెట్రోరైల్ చీఫ్ ఎలక్ట్రీకల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు,చీఫ్ సిగ్నలింగ్ అండ్ టెలికమ్ ఇంజినీర్ ఎస్‌కే దాస్, ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్ అండ్ టీ ఎంపీ నాయుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఏకే. సైనీ ఇతర సీనియర్ అధికారులతో కలిసి మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మైండ్‌స్పేస్ మార్గంలో తనిఖీలు పూర్తిచేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ ఆఫ్ మెట్రోరైలు సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) జానక్ కుమార్ గార్గ్ ఈ నెల 26, 27 తేదీల్లో సేఫ్టీ తనిఖీలు చేసి క్లియరెన్స్ ఇస్తే 29న ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల మరో 40 వేల మంది ప్రయాణికుల సంఖ్య పెరుగనుందని తెలిపారు. ఇది అందుబాటులోకి తేవడం వల్ల రెండో దశ ఏయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు అనుసంధానం చేయడానికి కూడా సులభమవుతుంది.

Related posts