telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇచ్చిన మాట ప్రకారం రాయచోటిలో అభివృద్ధి పనులు: సీఎం జగన్

ys jagan cm

“నేను ఉన్నాను” అంటూ మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ వెనుకబడ్డ రాయలసీమలో మరింత వెనుకబడిన ప్రాంతం రాయచోటి అని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలు తాగునీరు, సాగునీరు కోసం అల్లాడుతున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాయచోటిని అభివృద్ధి చేశారని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే రాయచోటి అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. హంద్రీ నీవా ద్వారా రాయచోటి, వేంపల్లి మండలాలకు జీఎన్ఎస్ఎస్, హంద్రీ నీవాలను అనుసంధానించడం ద్వారా తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు, కుప్పంలకు ప్రయోజనం చేకూరుతుందని, కాలేటివాగు రిజర్వాయర్ ను 1.2 టీఎంసీలకు పెంచుతున్నామని చెప్పారు. రాయచోటిలోని పీహెచ్ సీని వంద పడకల ఆసుపత్రి మారుస్తున్నామని చెప్పారు. పట్టణాభివృద్ధి కోసం రూ.340 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.

Related posts