telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ మ్యాచ్ నా ఆటను మార్చేసింది : జడేజా

ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జడేజా… కొన్నాళ్ల క్రితం టెస్టు జట్టులో కొనసాగుతున్నా తుది టీమ్‌లో మాత్రం చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో 2018లో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన అతను తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అప్పుడు ఐదో టెస్టులో ఆడిన ఇన్నింగ్సే జడేజాను టీమిండియాలో కీలక ఆటగాడిగా మార్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్న జడేజా.. తాజాగా ఓ నేషనల్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిక్తర విషయాలు పంచుకున్నాడు. ‘2018కి ముందు ఏడాదిన్నర పాటు నిద్రలేని రాత్రులు గడిపా. ఆ సమయంలో రోజూ తెల్లవారుజాము దాదాపు 5 గంటల వరకు మెలకువతోనే ఉండేవాడిని. ఏం చేయాలి. మళ్లీ ఎలా పుంజుకోవాలనే విషయాలపైనే ఆలోచించేవాడిని. దాంతో నిద్ర పట్టేది కాదు. అప్పుడు టెస్టు జట్టులో కొనసాగుతున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కేది కాదు. వన్డేల్లో చోటు కోల్పోయా. టీమిండియాతో కొనసాగడం వల్ల దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడలేకపోయా. నన్ను నేను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చేదికాదు. ఎలా ముందుకు సాగాలో అనేదానిపై తీవ్రంగా ఆలోచించేవాడిని. కానీ, 2018లో ఆడిన ఓవల్‌ టెస్టే మొత్తం మార్చేసింది. అది నా ఆటను, నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తర్వాత హార్దిక్‌ పాండ్య గాయపడటంతో నేను వన్డేల్లోకి తిరిగి వచ్చా. నాటి నుంచి నేను బాగా ఆడుతున్నా’ అని జడేజా చెప్పుకొచ్చాడు. కాగా, ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 332 పరుగులు చేయగా, టీమిండియా 160కే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అదే సమయంలో జడేజా(86) ఎనిమిదో ఆటగాడిగా బరిలోకి దిగి జట్టును ఆదుకున్నాడు. దాంతో జట్టు స్కోరును 292 పరుగులకు చేరింది. ఈ ఇన్నింగ్స్‌తోనే జడ్డూ తర్వాతి కాలంలో కీలక ఆటగాడిగా మారాడు.

Related posts