telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికల దగ్గరపడటంతో వివాదం రోజురోజుకీ ముదురుతోంది. అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు – ప్రకాశ్‌రాజ్‌ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. పలువురు నటీనటులు ‘మా’ అధ్యక్షుడిగా బయటివాళ్లను ఎందుకు ఎన్నుకోవాలి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు, దర్శకుడు రవిబాబు ‘మా’ ఎన్నికలపై స్పందించారు. లోకల్‌, నాన్‌లోకల్‌ వ్యవహారం గురించి తాను స్పందించాలనుకోవడం లేదంటూనే అధ్యక్ష పదవికి బయటవాళ్లను ఎందుకు ఎన్నుకోవాలంటూ ప్రశ్నించారు.

‘లోకల్‌ నాన్‌లోకల్‌ వివాదంపై మాట్లాడాలనుకోవడం లేదు. ఏదో ఒక ప్యానల్‌కు ఓటు వేయమని చెప్పాలనుకోవడం లేదు. మనకి ఎంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఉండగా మన దర్శక నిర్మాతలు మాత్రం బయటవాళ్లకే ఎక్కువగా అవకాశాలిస్తున్నారు. వాళ్ల డిమాండ్‌లకు ఒప్పుకొని మరీ ఆఫర్లు ఇస్తున్నారు. అదే మాదిరిగా కెమెరామెన్‌లు, మేకప్‌మేన్‌లు ఇలా ఒక్కటేమిటి సినిమాకు సంబంధించిన చాలా విభాగాల్లో మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారు.

ఈ విషయాన్ని పక్కనపెడితే.. నటీనటుల సంక్షేమం కోసం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ ‘మా’. మన కోసం మనం పెట్టుకున్నాం. అలాంటి ఒక చిన్న సంస్థలో పనిచేయడానికి కూడా మనలో ఒకడు పనికిరాడా? దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా? ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి’ అంటూ రవిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Related posts