telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇంటింటికి .. రేషన్ బియ్యం.. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళంలో ..

ration rice to home scheme started in AP

ఇప్పటివరకు రోడ్డు సరఫరా లేని కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి రేషన్‌ బియ్యం సక్రమంగా అందేవి కావు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులందరి ఇళ్లకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను వినియోగించారు. నాలుగు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 30 బియ్యం బ్యాగ్‌లు తడిసిపోయాయి. వాటిలోని బియ్యం ఉండలు కట్టినట్టు గుర్తించకపోవడంతో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ బ్యాగ్‌లను అందుకున్న లబ్ధిదారులు బియ్యం ఉండకట్టిన విషయాన్ని వలంటీర్లకు తెలియజేయడంతో వాటి స్థానంలో కొత్త బ్యాగ్‌లను తిరిగి పంపిణీ చేశారు.

బియ్యం పంపిణీ ఎలా ఉందన్న దానిపై లబ్ధిదారుల అభిప్రాయాల్ని వలంటీర్లు తీసుకుంటున్నారు. బియ్యం చాలా బాగున్నాయని పేదల నుంచి అభినందనలు వస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. పేద వాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి నాని విమర్శించారు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమ ఇళ్లకే నేరుగా బియ్యం తెచ్చి ఇస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ పరిధిలోని చీపురుపల్లి గ్రామానికి చెందిన పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. బియ్యం కోసం 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదని.. ఈ-పాస్‌ మెషిన్లు సరిగా పనిచేయక ఒక్కోసారి రెండు మూడు రోజులు తిరగాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. గిరిజన గూడేల్లోనూ ఇంటికే బియ్యం అందుతుండటంతో పేదల ఆనందం అవధులు దాటింది.

Related posts