telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పరిటాల సునీత, తనయుడు శ్రీరామ్‌పై కేసు నమోదు..

మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాామ్ తో పాటు రాప్తాడు టిడిపి నాయకులపై పోలీస్ కేసు నమోదయ్యింది. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి నిబంధనలకు విరుద్దంగా రాప్తాడులో ర్యాలీ నిర్వహించినందుకు వీరిద్దరిపై కేసు నమోదయ్యింది.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ సమీపంలో జాకీ పరిశ్రమ తరలి వెళ్లిపోవడానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డే కారణమని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. వెనక్కి వెళ్లిపోయిన జాకీ పరిశ్రమను తిరిగి రాప్తాడులోనే నెలకొల్పాలని.. జాకీ నిర్మాణ ప్రాంతం నుంచి టీడీపీ, సీపీఐ శ్రేణులతో కలసి తన తనయుడు పరిటాల శ్రీరామ్‌తో కలిసి ఆమె పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సభ కూడా నిర్వహించారు.

30 పోలీసు యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు.. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారని రాప్తాడు ఏఎస్‌ఐ దస్తగిరి ఫిర్యాదు చేశారు.  ఎన్‌హెచ్-44పై బెంగళూరు వైపు వెళ్లే వాహనాలను అడ్డుకోవడంతో పాటు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పరిటాల సునీత, శ్రీరామ్‌తో పాటు టిడిపి నాయకులు సాకే తిరుపాల, పంపు కొండప్ప, సిపిఐ నాయకులు రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు రాప్తాడు పోలీసులు తెలిపారు. మొత్తం 39 మంది నాయకులపై 143, 341, 188ఆర్/డబ్ల్యూ , 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

ప్రస్తుతం జిల్లాలో 30పోలీస్ యాక్ట్ అమల్లో వుందని… అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు, నిర్వహించడాన్ని నేరంగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. ఈ నిబంధలను పట్టించుకోకుండా రాప్తాడులో జాతీయ రహదారిపై భారీగా నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిటాల సునీత, శ్రీరామ్ ర్యాలీ నిర్వహించారని ఎస్‌ఐ బి.రాఘవరెడ్డి గురువారం తెలిపారు.

.

 

 

 

Related posts