rangasthalam

అక్కడ “రంగస్థలం”కు అనుమతి లభిస్తుందా ?

17

రామ్ చరణ్ కు తన సినిమా కెరీర్ లో ఎంతగానో పేరు తెచ్చిన చిత్రం “రంగస్థలం”. మిగతా హీరోలతో పోల్చుకుంటే రేసులో వెనకబడ్డాడు అనే కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో “రంగస్థలం”తో సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా మరో కొత్త మార్కెట్లో విడుదల కానుంది. బాహుబలి తరువాత చైనాలో విడుదల కానున్న మరో తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

ఇప్పటికే “రంగస్థలం” చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. రామ్ చరణ్ నటించిన ఈ రివేంజ్ డ్రామా ఇప్పుడు చైనాలో కూడా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని చైనాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో చైనాలో బాలీవుడ్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. “దంగల్” సినిమా ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. “భజరంగీ భాయిజాన్”, “సీక్రెట్ సూపర్ స్టార్”, “హిందీ మీడియం” సినిమాలు కూడా చైనాలో మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన “టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ” చిత్రానికి కూడా భారీ ఓపెనింగ్స్ లభించాయి.


కానీ తెలుగులో ఘన విజయం సాధించిన “బాహుబలి” చిత్రానికి మాత్రం చైనాలో ఎదురుదెబ్బ తగిలింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి-1” అక్కడ ఘోర పరాజయాన్ని చవి చూసింది. “బాహుబలి-2” కూడా అంతగా ఆడలేదు. ఇప్పటి వరకు చైనాలో విడుదలైన తెలుగు చిత్రాలు ఈ రెండే… ఈ రెండు చిత్రాలకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అయితే “రంగస్థలం” టీం చైనాలో తమ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతి కోసం అప్లై చేశారట.

అన్నను చంపిన వాడిపై పగ తీర్చుకునే రివేంజ్ డ్రామా ఇది… అయితే ఈ చిత్రాన్ని తెరపై అందంగా, చాలా కొత్తగా చూపించాడు సుకుమార్. సినిమాలోని పాటలు కూడా శ్రోతలను బాగా అలరించాయి. అయితే ఈ కథ చైనా ప్రేక్షకులకు నచ్చుతుందా ? చైనాలో సినిమా విడుదలకు అనుమతి లభిస్తుందా ? అనేది వేచి చూడాల్సిందే…!?