telugu navyamedia
రాజకీయ వార్తలు

మోడీ లక్ష్యం.. సాధ్యమయ్యేది కాదు.. : రంగరాజన్

rangarajan on modi govt targets

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అసాధ్యమని పలువురు ఆర్థిక నిపుణులు ఇప్పటికే చెప్పారు. తాజాగా, ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ కూడా ఈ అంశంపై స్పందించారు. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటుతో 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునే ప్రశ్నేలేదని చెప్పారు. ఇది సింప్లీ ఔట్ ఆఫ్ క్వశ్చన్ అని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జీడీపీ ఇటీవలి క్వార్టర్‌లో ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం వివిధ రంగాల్లో తీవ్ర మందగమనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రంగరాజన్ స్పందించారు.

ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 2.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉందని, రానున్న అయిదేళ్లలో దీనిని ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటున్నామని, అది సాధ్యం కావాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా కనీసం తొమ్మిది శాతం ఉండాలని, ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు ప్రకారం చూస్తే 2025 నాటికి మన ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయికి చేరే ప్రశ్నే లేదన్నారు. ప్రస్తుతం వృద్ధిరేటు ఆరు శాతం కంటే తక్కువగా ఉందని, వచ్చే ఏడాది 7 శాతంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ కాస్త పుంజుకుంటుందని రంగరాజన్ తెలిపారు. కానీ ఈ వృద్ధి శాతంతో అంతగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకుంటే ఒక్కొక్కరి తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న దాని కంటే రెట్టింపు అవుతుందని రంగరాజన్ చెప్పారు. ఇప్పుడు తలసరి ఆదాయం 1800 డాలర్లుగా ఉందని, ఇది ఏకంగా 3600 డాలర్లకు చేరుకుంటుందన్నారు. తలసరి ఆదాయం 12,000 డాలర్లుగా ఉండే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చునని, మనం ఈ స్థాయికి చేరుకోవడానికి కనీసం 22 ఏళ్లు పడుతుందని రంగరాజన్ అన్నారు. అది కూడా వృద్ధి రేటు 9 శాతంగా ఉంటే మాత్రమే అన్నారు.

Related posts