మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘రంగరంగ వైభవంగా’. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాధాగా కేతికా శర్మ, రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు.
సెప్టెంబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఆల్రెడీ విడుదలైన ‘రంగ రంగ వైభవంగా’ టీజర్, ‘తెలుసా తెలుసా’ పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
చిన్నప్పటి నుంచి గొడవపడే ఓ అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు వాళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశమని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ఇక ట్రైలర్ చివరల్లో ‘నాన్నా ఇప్పటి వరకు ఒకలెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క చెప్పను.. చూపిస్తా’అంటూ వేష్ణవ్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.