telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్జీవికి షాక్… “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”పై సెన్సార్ అభ్యంతరం

KRKR

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. అయితే ఈ సినిమాపై మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వారం రోజుల్లోగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ చిత్రం చూడాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రీజినల్‌ సెన్సార్‌ బోర్డ్‌ ఆ చిత్రాన్ని చూసి సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ఇది తమ నైతిక విజయమని ఆ సినిమాపై కోర్టుకు వెళ్లిన ఇంద్రసేన చౌదరి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సెన్సార్‌ కార్యాలయానికి ఇంద్రసేన చౌదరి, హైకోర్టు న్యాయవాది బాలాజీ వెళ్లి సెన్సార్‌ అధికారిని కలిశారు.

ఈ సందర్భంగా ఇంద్రసేన చౌదరి విలేకరులతో మాట్లాడుతూ “పబ్లిక్‌ ఇంట్రస్టెడ్‌ లిటికేషన్‌ కింద హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం వల్ల కోర్టువారు మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్‌ బోర్డ్‌ను ఆదేశించారు. హైకోర్టు సూచనల మేరకు సెన్సార్‌ బోర్డు సభ్యులు శనివారం సినిమాను చూసి, ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ చిత్రం ప్రజల్లోకి వెళ్లడం సహేతుకం కాదని నిర్ణయించారు. పిటీషనర్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలు సినిమాలో చాలా స్పష్టంగా ఉన్నాయని సెన్సార్‌ బోర్డ్‌ భావించి సినిమాకు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించింది. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని కోర్టు మరోసారి నిరూపించింది. ఆ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ నిరాకరించడం మా విజయంగా భావిస్తున్నాం’ అన్నారు. సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేమని చెప్పిన నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, హోర్టింగులు ప్రదర్శించడం చట్టరీత్యా నేరమవుతుందనీ, వెంటనే వాటిని నిర్మాతలు తొలగించాలనీ న్యాయవాది బాలాజీ చెప్పారు. ఈ విషయమై చిత్రనిర్మాతలు రీజినల్‌ సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం చెప్పడంతో రివైజింగ్‌ కమిటీకి వెళుతున్నామనీ, సెన్సార్‌ సర్టిఫికెట్‌ చేతికి వచ్చిన తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పారు.

Related posts