telugu navyamedia
రాజకీయ వార్తలు

రాజ్యసభలో భావోద్వేగానికి లోనైయిన వెంకయ్య నాయుడు

రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్‌ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తన నెలకొనడం దురదృష్టకరమంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య ప్రసంగిస్తూ.. ”ప్రజాస్వామ్యానికి పార్లమెంట్‌ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. కానీ కొందరు సభ్యులు సభలో అమర్యాదగా ప్రవరించారు. టేబుళ్లపై కూర్చున్నారు. కొందరు టేబుళ్లపై నిల్చున్నారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లే. నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి” అంటూ తీవ్రంగా కలత చెందారు.

సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. . రాజ్యసభలో మంగళవారం రైతుల సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా కొందరు సభ్యులు నల్లని వస్త్రాలను ఊపుతూ, పత్రాలు విసిరేస్తూ తమ నిరసనలు తెలిపారు. ఒకదశలో చాలా మంది ఎంపీలు సభాపతి స్థానానికి దిగువన పార్లమెంటరీ సిబ్బంది కూర్చొనే చోట టేబుళ్లపైకెక్కి నిల్చొన్నారు. మరికొందరు వాటిపై దాదాపు గంటన్నరసేపు బైఠాయించారు. ఇంకొందరు వీటి చుట్టూ చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.

మరోవైపు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. నిజానికి షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉండగా.. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో చర్చలకు ఆస్కారం లేనందున సభను ముందుగానే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా నేడు ప్రకటించారు. ఇప్పటికే పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా నిరసనల నడుమే వాటిని సభ ఆమోదించింది.

Related posts