భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజీవ్ సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పలువురు కాంగ్రెస్ సీనియర్లు సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఆయన వర్థంతిని నిర్వహించారు.
రాజీవ్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. భారత రత్న గ్రహీత అయిన ఆయన 1984 నుంచి 1989 వరకు 6వ భారత ప్రధానిగా సేవలు అందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరుంబదూర్ వద్ద జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో రాజీవ్ హత్యకు గురయ్యారు.