telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : రాజస్థాన్ ఖాతాలో .. మరో గెలుపు..

rajastan won on kolkata in ipl 2019 match

ఐపీఎల్‌-12లో రాజస్థాన్‌ మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. రియాన్‌ పరాగ్‌ (47; 31 బంతుల్లో 5×4, 2×6), జోఫ్రా ఆర్చర్‌ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 2×6) పోరాడడంతో గురువారం జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. దినేశ్‌ కార్తీక్‌ (97 నాటౌట్‌; 50 బంతుల్లో 7×4, 9×6) విధ్వంసక విన్యాసాలతో మొదట కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ ఆరోన్‌ (2/20) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పరాగ్‌, ఆర్చర్‌ల పోరాటంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌… 19.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ కష్టసాధ్యం కాని ఛేదనలో అనూహ్యంగా సాగింది. రహానె (34; 21 బంతుల్లో 5×4, 1×6), శాంసన్‌ (22; 15 బంతుల్లో 2×6) దూకుడుతో 5 ఓవర్లలో 53/0తో లక్ష్యం దిశగా దూసుకుపోయిన ఆ జట్టు నరైన్‌ (2/25), పియూష్‌ చావ్లా (3/20) స్పిన్‌ మాయాజాలానికి విలవిల్లాడిపోయింది. పది పరుగుల వ్యవధిలో ఓపెనర్లతో పాటు స్టీవ్‌ స్మిత్‌ (2) వికెట్‌నూ కోల్పోయి 63/3కు చేరుకుంది. 11వ ఓవర్లో చావ్లా.. స్టోక్స్‌ను ఔట్‌ చేసేటప్పటికి స్కోరు 78. చావ్లా.. తర్వాతి ఓవర్లో బిన్నీ (11)నీ పెవిలియన్‌ చేర్చడంతో 98/5తో నిలిచింది రాజస్థాన్‌. పెద్ద బ్యాట్స్‌మెనెవరూ లేకపోవడంతో ఆ జట్టు ఓటమి తప్పించుకోవడం కష్టమే అనిపించింది. కానీ 17 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ గొప్పగా పోరాడాడు. ఓవైపు అతడు నిలబడడం.. మరోవైపు శ్రేయస్‌ గోపాల్‌ (18; 9 బంతుల్లో 4×4) ఉన్న కాసేపు ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ అదుపులోనే ఉంది. గోపాల్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన ఆర్చర్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్థాన్‌లో గెలుపు ఆశలు చిగురించాయి. నరైన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో ఆర్చర్‌ సిక్స్‌ కొట్టగా.. పరాగ్‌ ఫోర్‌ సాధించాడు. వెంటనే ప్రసిద్ధ్‌కృష్ణ బౌలింగ్‌లో పరాగ్‌ ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సిన స్థితిలో రాజస్థాన్‌ విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. 19వ ఓవర్లో రసెల్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌ కొట్టిన పరాగ్‌.. ఆ వెంటనే అనూహ్యంగా హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో రాజస్థాన్‌కు 9 పరుగులు అవసరమైన స్థితిలో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. ఐతే ఆర్చర్‌ రెండు బంతుల్లోనే ఆ ఉత్కంఠకు తెరదించాడు. ప్రసిద్ధ్‌కృష్ణ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాది రాజస్థాన్‌ను ఆనందంలో ముంచెత్తాడు.

కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఆటే కోల్‌కతా ఇన్నింగ్స్‌లో హైలైట్‌. ఇంకెవరూ రాణించకపోయినా కోల్‌కతా అంత స్కోరు చేసిందంటే కారణం అతడొక్కడే. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన కార్తీక్‌ చెలరేగి ఆడాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆరంభం పేలవం. ఆరోన్‌ (2/20) ధాటికి ఐదు ఓవర్లలో 30 పరుగులకే ఓపెనర్లు లిన్‌ (0), శుభ్‌మన్‌ గిల్‌ (14) వికెట్లను చేజార్చుకుంది. రాణా (21; 26 బంతుల్లో 3×4) ఎనిమిదో ఓవర్లో ఔటయ్యాడు. ఆరోన్‌తో పాటు శ్రేయస్‌ గోపాల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో దినేశ్‌ కార్తీక్‌ కూడా వేగంగా ఆడలేకపోయాడు. కోల్‌కతా స్కోరు 10 ఓవర్లలో 49 పరుగులే. ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ గేర్‌ మార్చిన కార్తీక్‌ కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడ్డాడు. ఎడాపెడా ఫోర్లు సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి జోరుతో చివరి పది ఓవర్లలో కోల్‌కతా ఏకంగా 126 పరుగులు రాబట్టింది. 11వ ఓవర్‌ నుంచి మొదలైంది కార్తీక్‌ విధ్వంసం. కార్తీక్‌ వరుసగా 6, 4, 4, 4.. నరైన్‌ ఓ సిక్స్‌ బాదడంతో గోపాల్‌ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 25 పరుగులొచ్చాయి. ఆర్చర్‌ బౌలింగ్‌లోనూ కార్తీక్‌ చక్కని ఫ్లిక్‌తో సిక్స్‌ కొట్టాడు. కానీ వికెట్ల మధ్య పేలవ పరుగుతో నరైన్‌ (11) రనౌటయ్యాడు. అయినా కార్తీక్‌ జోరు కొనసాగించాడు. ఆరోన్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌, ఉనద్కత్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌ దంచాడు. అయితే మరోవైపు రసెల్‌ (14) కూడా నిలువలేదు. రాజస్థాన్‌ ఫీల్డర్లు రెండు సార్లు క్యాచ్‌లు వదిలేసినా సద్వినియోగం చేసుకోలేకపోయిన రసెల్‌.. 17వ ఓవర్లో థామస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు స్కోరు 127/5. ఆఖరి మూడు ఓవర్లలో కార్తీక్‌ మరింత రెచ్చిపోయాడు. ఉనద్కత్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన అతడు.. ఆర్చర్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు దంచేశాడు. అదే జోరుతో ఉనద్కత్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో ఓ ఫోర్‌, రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆఖరి బంతిని బౌండరీ దాటించి ఉంటే శతకం పూర్తయ్యేది కానీ.. సింగిలే వచ్చింది.

rajastan won on kolkata in ipl 2019 matchనేడు మ్యాచ్ : చెన్నై vs ముంబై రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

Related posts