telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

రాజకీయ వేడి పెంచిన .. రజనీకాంత్ ..

rajanikanth speeding up party works

రజనీకాంత్ పార్టీ ప్రారంభ పనులు ఊపందుకున్నాయి. శాసనసభ ఎన్నికలే తమ లక్ష్యమని ప్రకటించిన సూపర్‌స్టార్‌ ఆ దిశగా పనులను వేగవంతం చేశారు. 2021 శాసనసభ ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీ ప్రారంభించడానికి, తిరుగులేని ఆగమనం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని కోసం ఓ రాజకీయ వ్యూహకర్తను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. తన పార్టీ ప్రచారం కోసం సొంత టీవీ ఛానల్‌ను ప్రారంభించడానికి కూడా కసరత్తులు చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ తన రాజకీయ ప్రవేశం గురించి 2017 డిసెంబరు 31న రజనీకాంత్‌ వెల్లడించారు. కానీ, ఇప్పటి వరకు పార్టీ మాత్రం ప్రారంభించలేదు. లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. శాసనసభ ఎన్నికలే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేస్తామంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారు.

సాధారణ శాసనసభ ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆలోగా పార్టీని ప్రారంభించాలని భావిస్తున్నారు. దానిని ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పనుల్ని అత్యంత పకడ్బందీగా చేపట్టేందుకు రాజకీయ వ్యూహకర్త కోసం అన్వేషిస్తున్నారు. ఐ ప్యాక్‌ సంస్థ అధినేత పీకే అలియాస్‌ ప్రశాంత్‌ కిశోర్‌ను కొద్ది వారాల క్రితం రజనీకాంత్‌ సంప్రదించినట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రశాంత్‌ కిశోర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలు ఉత్తరాది రాష్ట్రాలకు చెల్లుతాయని, దక్షిణాది వాటికి కాదని రజనీకి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో రజనీకాంత్‌ వెనకడుగు వేయడంతో ఐ ప్యాక్‌ సంస్థ సేవల్ని కమల్‌ వినియోగించుకున్నారు. ప్రస్తుతం తాను ప్రారంభించనున్న పార్టీని వేగంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లేందుకు మరోసారి ప్రశాంత్‌ కిశోర్‌ వైపు రజనీ చూశారు.

లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లో కమల్‌ పార్టీకి పీకే అందించిన వ్యూహాలు అంతగా ఫలితం ఇవ్వలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనకూ పీకే ప్రణాళిక అనుకూల ఫలితాలు తెచ్చి పెట్టలేదు. దీంతో రజనీ తన నిర్ణయం మార్చుకున్నారని తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన రాజకీయ వ్యూహకర్త జాన్‌ ఆరోగ్యస్వామిపై రజనీ దృష్టి పడింది. 2016 శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి కోసం జాన్‌ ఆరోగ్యస్వామి పనిచేశారు. రాష్ట్ర రాజకీయ మెలకువలు, ఎన్నికల కదనరంగం పరిస్థితి, రాష్ట్రంలోని సామాజికవర్గాల ప్రభావం గురించి జాన్‌ ఆరోగ్యస్వామికి పట్టుంది. ఆయన వ్యూహాల ఫలితంగానే 2016 శాసనసభ ఎన్నికల్లో పీఎంకే ఓటు బ్యాంకు 4 నుంచి 6 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఆయన గురించి రజనీకాంత్‌ ఆరా తీస్తున్నాని సమాచారం.

Related posts