telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటుడిలో నటుడు రాజబాబు: చిరస్మరణీయమైన స్మృతులు, సుజల స్నేహబంధాలు

రాజబాబు స్మృతి ఎప్పటికీ చిరస్మరణీయమే
బొడ్డు రాజబాబు.
ఈ తరం ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు.
తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి మరింత ముందుకు తీసుకెళ్లిన నటుడు రాజబాబు . ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే సూక్తిని నిరంతరం పాటించిన రాజబాబు స్నేహితులంటే ప్రాణం మానవ సంబంధాలకు అధిక ప్రాధాన్యమిచ్చే రాజబాబు ఆ బంధాలే ఆయన తరువాత కూడా కొనసాగుతున్నాయి , రాజబాబు జయంతి రోజు సంస్మరణ దినంగా పాటిస్తూ. రంగస్థల , టీవీ , సినిమా , జర్నలిజం , విద్యా, వైద్య రంగాల్లో నిష్టాతులైన వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేసి గౌరవిస్తున్నాయి.
అసలు ఎవరీ రాజబాబు ? ఏమా కథ ?
రాజబాబు రామచంద్రపురం మండలం నరసాపురపేటలో జన్మించారు తండ్రి రామతారకం. తల్లి అనంత లక్ష్మి సరస్వతీదేవి. రామతారకం, దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించిన “స్వర్గం నరకం “, “దేవుడు చేసిన పెళ్లి ” ,సినిమాల నిర్మాతల్లో ఒకరు.
రాజబాబుది విభిన్నమైన , విలక్షణమైన వ్యక్తిత్వం. రాజబాబుతో ఒక్కసారి పరిచయం ఏర్పడితే అది జీవిత కాలం కొనసాగవలసిందే. కోనసీమ యాస , భాష మాత్రమే కాదు , ఆ అభిమానం , అంతులేని ఆత్మీయత కలబోసుకున్న స్వచ్ఛమైన స్నేహపాత్రుడు రాజబాబు .
రాజబాబు స్వతహాగా హాస్యప్రియుడు , ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు విరపూస్తాయి , స్నేహ మాధుర్యం పరిమళిస్తుంది.
రాజబాబు కు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం . ఎక్కడ నాటకం ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు . ఆ ఇష్టం , అభిమానమే ఆయన్ని రంగస్థలం మీదకు తీసుకు వచ్చింది .
మొదటగా “ఊరుమ్మడి బతుకులు ” నాటకంలో రాజబాబు నటించారు . ఆయన నటనను అందరూ మెచ్చుకున్నారు . స్నేహితులైతే రాజబాబును సహజమైన నటుడంటూ ప్రశంసలు కురిపించారు . ఆ స్పూర్తితో “పుటుక్కు జర జర డుబుక్కు మే “, పూజకు వేళాయెరా ” నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నారు .
1995లో రాజబాబు జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది .రాజబాబుకు చిన్ననాటి స్నేహితుడు ఉప్పలపాటి నారాయణ రావు . శ్రీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన “వూరికి మొనగాడు” చిత్రంలో రాజబాబుకు ఓ వేషం ఇచ్చారు . ఆ సినిమా రాజబాబు ను వెండితెర వైపు తన ప్రయాణాన్ని కొనసాగేలా చేసింది . ఆ తరువాత “సిందూరం “, మురారి “, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే”, “శ్రీకారం ‘, “సముద్రం “, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు “, “కళ్యాణ వైభోగం “, మళ్ళీరావా ?”, “భరత్ అనే నేను ” మొదలైన చిత్రాల్లో రాజబాబు నటించారు .
ఇక టీవీ లో “అభిషేకం “, “వసంత కోకిల “, “రాధా మధు “, “మనసు మమత”, “బంగారు కోడలు “, “బంగారు పంజరం “, “చి. ల .సౌ స్రవంతి ” , “ప్రియాంక ” లాంటి సీరియళ్ళలో రాజబాబు విలక్షణమైన పాత్రలను పోషించారు .
సినిమా, టీవీ ఏ పాత్ర లోనైనా అవలీలగా ఇమిడిపోయే తత్త్వం , ఆ పాత్ర ను సజీవంగా మన మధ్యకు తీసుకురాగల మనస్తత్వం రాజబాబు ప్రత్యేకత . రాజబాబు సహజ నటుడు . ఏ రసాన్నైనా పండించగల ప్రజ్ఞ ఆయనలో వుంది .
రాజబాబు ఈరోజు మన మధ్య లేరు . కానీ ఆయన జ్ఞాపకాలు మన మనస్సులో పదిలంగా వున్నాయి .ఆయన నటించిన టీవీ సీరియళ్లు , సినిమాలు రాజబాబును గుర్తు చేస్తూనే ఉంటాయి.
రాజబాబు స్మృతి ఎప్పటికీ చిరస్మరణీయమే

Related posts