గత ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా చేసేందుకు కూడా యత్నించారని, కానీ అమిత్ షా జోక్యం చేసుకోవడంతో తనకు టికెట్ వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి సమర్థుడైన నాయకుడు కనిపించడం లేదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర బీజేపీ నేతల్లో నలుగురైదుగురు కలలు కంటున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వం తనను కనీసం గుర్తించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాపోయారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తన నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు కూడా… తనకు సమాచారం ఉండటం లేదని ఆరోపించారు. దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రొటోకాల్ ను కచ్చితంగా పాటించేవారని రాజాసింగ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్ నాయకులే … ఆయనను ఓడిస్తారని చెప్పారు.