telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

రైతు భరోసా.. ఏపీలో, అక్టోబర్ 15 నుండే .. : జగన్

cm jagan on govt school standardization

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద రైతులకు రూ.12,500 చొప్పున అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దుచేస్తున్నట్టు వెల్లడించారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన నివాసంలో వ్యవసాయం, అనుబంధరంగాలు, జలవనరుల విభాగంపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలని, రూ. మూడువేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై థర్డ్‌పార్టీ విచారణ చేపట్టాలని.. అవసరమైతే కొన్ని ప్రాజెక్టుల్లో రీటెండరింగ్‌కు వెళ్లాలని జలవనరుల విభాగంపై నిర్వహించిన సమీక్షలో ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని స్పష్టంచేశారు. థర్డ్‌పార్టీ సభ్యులుగా నీటిపారుదల, సాంకేతికరంగాలకు చెందిన నిపుణులు ఉండాలని సూచించారు.

జగన్ నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. దీనిపై నూతన విత్తనచట్టం తేవాలని అధికారులు సూచించగా.. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని జగన్ అన్నారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలను.. వ్యవసాయరంగం అవసరాలకు ప్రధానకేంద్రంగా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలి.. రైతులకు బీమా సౌకర్యం సక్రమంగా అందించే పూర్తి బాధ్యత ఇక ప్రభుత్వానిదే. ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పరిష్కారాలు వందశాతం ఉండాలి. రైతులకు ప్రయోజనాలు అందకపోతే ప్రభుత్వాలెందుకు.. రైతు సంతృప్తి చెందకపోతే ఎంతచేసినా వృథానే అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Related posts