telugu navyamedia
రాజకీయ

కాసేప‌ట్లో ఈడీ ఎదుట హాజరుకానున్న రాహుల్… ఆందోళ‌న‌కు సిద్ధ‌మైన కాంగ్రెస్ నేత‌లు

*సోనియా , రాహుల్‌కు మద్ద‌తుగా కాంగ్రెస్ నిర‌స‌న‌
*రాహుల్‌గాంధీ నివాసానికి ప్రియాంక‌గాంధీ
*అక్ర‌మంగా ఈడీ కేసులు పెట్టార‌ని కాంగ్రెస్ ధ‌ర్నా..
*ఢిల్లీలో కాంగ్రెస్ స‌త్య‌గ్ర‌హ మార్చ్ ఏర్పాటు
*కాంగ్రెస్ మార్చ్‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌
*భారీగా బారికేడ్లు, పోలీసుల బందోబ‌స్తు ఏర్పాటు ..

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరికాసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

దీంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపనిచ్చింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాహుల్, సోనియాలకు ఈడీ నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.పక్షాల గొంతు నొక్కేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నివాసం తుగ్లక్ లేన్, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డు చుట్టూ ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రెండు ప్రదేశాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు.

కాంగ్రెస్ నేతల నిర్వహించ తలపెట్టిన నిర‌స‌న‌కు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు… ఆ పార్టీ కార్యాలయాన్ని బారిగేట్లతో దిగ్బంధించారు. ఢిల్లీ పోలీసులు వద్ద ఉన్న జాబితాలోని సీనియర్ నేతలకే అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

నిరసన తెలిపేందుకు వచ్చిన కొంతమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.మరోవైపు, పార్టీ జనరల్ సెక్రెటరీలు, సీడబ్ల్యుసీ సభ్యులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇక.. ఢిల్లీలో కాంగ్రెస్ స‌త్య గ్ర‌హ్ మార్చ్ చేప‌ట్టింది. రాహుల్ నేతృత్వంలో ఏఐసీసీ ఆఫీస్ నుండి ఈడీ కార్యాల‌యం వ‌ర‌కు గాంధేయ‌మార్గంలో పాద‌యాత్ర చేప‌డుతోంది. కాంగ్రెస్ నిర‌స‌న ర్యాలీల‌కు అనుమ‌తి నిరాక‌రించిన పోలీసులు..భారీగా బ‌ల‌గాలు మోహ‌రించారు. ఎక్క‌డిక‌క్క‌డ బారికేడ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణుల‌ను అడ్డుకొని అరెస్టులు చేస్తున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా రాహుల్ గాంధీతో పాటు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు.

Related posts