కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆ పార్టీ తెలంగాణ నేతలు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కుంతియ తదితరులు భేటీ అయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమి పై చర్చించారు. తెలంగాణలోని 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించాలని రాహుల్ గాంధీ ఆదేశాలు ఇచ్చారు.
అనంతరం ఉత్తమ్, కుంతియా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జిల్లాలకు వెనువెంటనే డీసీసీ అధ్యక్షుల నియమించాలని పీసీసీని రాహుల్ ఆదేశించారు. అదేవిధంగా మండల కమిటీలు, బ్లాక్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. జనవరి 10వ తేదీలోగా సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేయాలని రాహుల్ ఆదేశించారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులే పంచాయతీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించాలని అధిష్ఠానం ఆదేశించినట్టు వారు తెలిపారు.