telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత జట్టుకు కోచ్ గా ద్రవిడ్…

జూన్‌ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసాక భారత్ అక్కడే ఉండి కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లు అనంతరం.. ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్ సిరీస్ గ్యాప్‌లో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుండడంతో.. శ్రీలంక పర్యటనకు మరో భారత జట్టు (ఇండియా-బి టీమ్)ను బీసీసీఐ పంపనుంది. ప్రధాన జట్టులో చోటు దక్కని సీనియర్లు, ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో ఓ జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. ప్రధాన జట్టుతో పాటే చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఇంగ్లండ్ వెళ్లబోతున్నారు. దాంతో లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. లంక టూర్‌కి కోచ్‌గా వ్యవహరించమని బీసీసీఐ ద్రవిడ్‌ని కోరినట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌తో పాటు ఎన్‌సీఏలోని సపోర్ట్ స్టాఫ్‌ కూడా లంకకి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

Related posts