గచ్చిబౌలిలోని ప్రిసం పబ్‌లో జరిగిన దాడిపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీర్ బాటిల్స్‌తో విచక్షణా రహితంగా రాహుల్‌పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన రాహుల్ తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.అంతేకాకుండా తనతో ఉన్న మహిళల పట్ల కూడా దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారని, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి తనపై దాడి చేసిన వారిని శిక్షించాలని రాహుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పబ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని రాహుల్ ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ శ్రీనివాసులు తెలిపారు. పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 324, 34 రెడ్‌విత్ కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు. త్వరలోనే నిందుతులను పట్టుకుంటామని తెలిపారు.