తెలంగాణ సిఎం కెసిఆర్ కు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తన అరెస్ట్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఒక ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసంచాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) పట్టించుకోలేదని వెల్లడించారు. అరెస్టు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదన్నారు. ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు రఘురామరాజు. ఈ నెల 14 న తన అరెస్ట్ సమయంలో ఇచ్చిన తీర్పులు, పోలీసు నిబంధనల ఉల్లంఘన వివరిస్తూ.. సిఎం కెసిఆర్ కు 8 పేజీల లేఖ రాశారు. తెలంగాణ పోలీసులు “రూల్ ఆఫ్ లా “ను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కెసిఆర్ ను కోరారు. సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ బృందంతోపాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. కాగా ఇటీవలే రఘురామ కృష్ణరాజుకు బెయిల్ మంజూరు అయింది. రఘురామరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. బెయిల్ పై బయటకి వెళ్ళాక.. విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
previous post