telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

“నేతగాడు… నిత్య ఈతగాడు”

చినిగిన చొక్కాకి అతుకులేసుకొని

నలిగిన మోముపై చిరునవ్వు దిద్ది

మూడడుగుల గుంటలో ముచ్చటగా కూర్చొని    

ఒక కాలు పైకి, మరొక కాలు కిందకి తొక్కేస్తూ

ఎడమ చేత్తో మగ్గాన్ని ముందుకు, వెనక్కి ఆడిస్తూ

కుడి చేత్తో కుచ్చు తాడుని లాగేస్తూ

నడుస్తున్న నాడిని అనుక్షణం గమనిస్తూ

కండె పోగు దొర్లినా కళంకమే తన వృత్తికి

నేసిన నేతనంత తన ముందున్న దోనెకు అందంగా పేర్చుతూ  

నిరంతరం అవయవాలన్నిటిని వ్యాయామం చేయిస్తూ  

 

పోగును పోగును కలగలిపి అద్భుతంగా అద్ది

ముద్దు ముద్దుగా పవుటంచును, చీరంచును

తనయొక్క నేర్పరితనంతో అలంకరించ గల మేధావి

ఆకలి నేర్పిన పాటమో…బ్రతుకు ఇచ్చిన బలమో…

కుటుంబ పోషణకు పితరులు ఇచ్చిన విద్యనో…

 

చిక్కుపడ్డ పోగులను అల్లుకుంచె చేతపట్టి అవలీలగా విప్పగలడు

ఏడు గజాల చీర నేయడానికి మండే ఎండలోనైనా

భరించి, నడుంబిగించి మూడు గంటల సేపు పాగళ్ళతో పోరాటం

 

నేను కార్చే చెమటచుక్క నేను కన్నవారి కనులలో

కాంతులై మెరవాలి అన్న చిన్న ఆశ  

నేను గొంతెండి ఈ గుంటలో కిక్కిరిసిపోతున్న

నేను కన్న వాళ్ళు విదేశాల్లో విలాసంగా జీవించాలి

నా కష్టం వారి విజయానికి సోపానం కావాలి  

నా ప్రాణం బక్కచిక్కినా

పోగులు వెతికి వెతికి చూపు సన్నగిల్లినా  

ప్రాణం పోయే వరకు నా పరుగు ఆపలేను

 

అతుకులు పడ్డ నా బ్రతుకు

మసిబారిన నా మనసు గదులు

కొత్త కొత్త ఆలోచనలు ప్రేరేపిస్తుంటే

సరికొత్తగా జెరిపోగులతో మెరిపిస్తూ

పాదరసంలా జారిపోతూ మగువల మనసులు దోచాలని

తాయారు చేస్తున్న నా శరీర అలసటనంతా మరిచిపోయి

హాయిగా నవ్వుకుంటూ….నేసేస్తున్నా….

నేతగాడిలా కాదు….నిత్య ఈతగాడినై……

 

                           

Related posts