telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చిరునవ్వులే చిరునామా

సృష్టిలో వెలకట్టలేని కొనలేని
అరుదైనది ఏమిటో తెలుసా?
ప్రేమతో పలకరిస్తేనే చాలు
ప్రతిగా దొరికే అపురూపమైన
మురిపాల ముద్దులొలికే
మన చిట్టి పసిడి కూనల
అలౌకిక చిరునవ్వులే కదా ?
జీవిత అనుభవాలను
పండించుకుని తిరిగి
పసితనాన్ని వెలిగించే
పండు ముసలి బోసి నోటి
ఆనందాల ముసి ముసి
నవ్వులని చూసి మురిసిపోలేదా?
మౌనంగా రేఖల్ని విప్పుకుంటూ
మొగ్గలన్నీ విచ్చుకుంటూ
సుగంధాలు పరిమళిస్తూ
పువ్వులుగా నవ్వటం కనలేదా ?
మట్టిని తొలుచుకుని
వేసిన ప్రతి విత్తనం అంకురంగా
నిలిచినందుకు జన్మనిచ్చిన రైతన్న
కళ్ళల్లో వెలుగుల నవ్వులను
ఎపుడైనా చూడకలిగారా ?
ఆకలి కడుపులకు న్యాయంగా
కడుపు నిండా పట్టెడన్నం
దొరికిన పండుగ రోజున
తృప్తినిండిన నగుమోమును
చూడకుండా ఉండగలమా ?
గుక్కపెట్టి ఆకలితో ఏడ్చే
చిన్నారిని గుండెకు హత్తుకుని
పాలిచ్చే కన్నతల్లి ఎదలో పొంగే
తనివితీరని తృప్తికి మోములో
వెలిగే అమృత నవ్వు చూశారా?
లోకపు రీతులు పట్టని
రంగుల సీతాకోక చిలుకల్లాంటి
చిన్నారులు ఆడుతూ గంతులేస్తూ
వెండి వెన్నెలను పండిస్తూ
నవ్వుల సెలఏరులవటంగమనించారా?
ఆశయం కోసం అమరులైన
వీరులు కలగన్న అందమైన లోకపు
ఆనవాళ్లను తమ నిర్జీవ పెదాలపై
కనిపించీ కనిపించని చిరునవ్వులను ఎపుడైనా దర్శించారా ?
కులం మతం నలుపు తెలుపు
నవాబు గరీబు తేడాలెరగని
ఎల్లలు లేక ఏ భాషకు చెందని
మనిషితనం వెల్లివిరిసే
చెరగని నిండైన చిరునవ్వులు
విశ్వమందున మానవుల
శాశ్వత చిరునామా కావాలి

Related posts