telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

బ్రతుకు పోరాటంలో..ప్రైవేటు టీచర్లు

కరోనా !

వేశావు

ప్రైవేటుపై విషపు కాటు…

చేశావు

అక్షరాన్నినడ్డివిరిచి

నడిరోడ్డు చేటు !

 

దశాబ్దాల అనుభవముంటేనేమి

ఆత్మాభిమానంతోనే

బ్రతుకుతున్నారు

అరిగిన చెప్పుల్లోనైనా !

 

బాలల విద్యా తోటమాలియై

విజ్ఞాన భాండాగారమై

శక్తి కణాలను

ఒక్కొక్కటిగా దానం చేసి

నిస్సహాయకులై

రోజు కూలీలయ్యారు !

 

ఓనమాలు

దిద్దించే బ్రతుకు

చితికి పోతుండె

ఆహారన్వేషణలో !

ముద్దకోసం…..

తడిసి ముద్దయిపోతుండే

అక్షరాలు

చెమట చుక్కల్లో !

 

పరుషాలు నేర్పడమే కానీ

పరుషంగా 

మాట్లాడనేరడు

నీతి శతకాలు

బోధనయే కానీ

అవినీతి 

చేయనెరుగడు !

 

అక్షర కిరణాలతో 

అజ్ఞానంధకారాన్ని

పారద్రోలు -గురువు !

అందలేని దానికై

ఆరాటపడక

పొందలేని వాటికై

ప్రాకులాడక

అందిన దానితో ఆనందిస్తూ…

పొందిన వాటితో పరవశిస్తూ…

ఆకాశమంత విశాల చీకటిలో

మిణుగురంత ఆశతో 

బ్రతుకీడుస్తున్న 

ఓ దివ్వె-గురువు !

ఎడారి జీవితంలో

అవకాశాలు

ఎండమావులైనా….

కన్నీళ్ళు ఒడిసిపట్టి

కుటుంబ దాహార్తిని తీర్చే

ఒయాసిస్సు -గురువు !

పూలమ్మిన చోటే

కట్టెలమ్మే పరిస్థితి

సర్కారైనా ఏకాక్షితో

ఓరచూపు చూడని దుస్థితి !

 

”విద్వాన్ సర్వత్రా పూజ్యతే”

నేటి కరోనావస్థలో

బరువులు మోస్తున్న 

గురువు శోకాన్ని చూసి

శ్లోకాన్ని సవరించుకుంటున్నాయి పురాణాలు !

నల్లబల్లపై

తెల్లని వర్ణాలు 

వ్రాసేటి శిధిల సౌధం 

తెల్లని జీవితంలో

అలుముకున్నాయి

నల్లనిచ్ఛాయలు !

 

నిత్య కృత్య భూభ్రమణంలో

పాఠశాల చుట్టూ సాగిన

పరిభ్రమణం

అక్షరాలు అక్షం మారి

ప్లూటో గ్రహాలయ్యాయి !

 

తప్పించేదెవరు ఈ ఘోరం

భగవంతునికి తప్పదు భారం !!

 

            

Related posts