telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమ్మ గర్భం..

అమ్మా…
నేను నీ గర్భంలో ఉండగా
నీ బరువుతో బాటుగా నా భారాన్నీ మోసినవి
పవిత్రమైన ఈ పాదాలే కదా…
నాకు నలత చేస్తే
నన్ను భుజాన వేసుకొని
వడివడిగా వైద్యుడి దగ్గరకు
వేగంగా పరిగెట్టినవి ఈ పాదాలే కదా…
నేను ఏమీ తిననని మారాం చేస్తుంటే
నన్ను చంకనేసుకొని చందమామను చూపిస్తూ
నువ్వు గోరుముద్దలు తినిపిస్తుంటే
అటూ ఇటూ నదయాడినవి ఈ పాదాలే కదా…
మా ఆకలి దప్పికలు తీర్చేందుకు
దూరమూ భారమూ అనుకోకుండా
నెత్తిమీద బిందెనూ
చంకలో నా చెల్లినీ
బరువనుకోకుండా మోస్తున్నవి ఈ పాదాలే కదా…
అంతెందుకు మొన్న నా చెయ్యిరిగినప్పుడు
రివ్వున పరిగెట్టుకొచ్చి
ఇంతెదిగిన నన్ను
చప్పున చంటిపిల్లాడిలా చంకనేసుకొని
దవాఖానాకి దౌడు తీసినవి ఈ పాదాలే కదా…
అమ్మా…
నీ పాదంలో గుచ్చుకున్న ఈ ముల్లు
నా మనసులో కలుక్కుమంటుంది
ఈ ముల్లును తీసి
నా మనసు బాధను చల్లార్చుకోనీ తల్లీ…
నా జీవితమంతా నీకు పాదరక్షనై
నీ ఋణం తీర్చుకొంటానులే అమ్మా…

Related posts