రహదారి…
హృదయం
ప్రపంచాన్ని పెనవేసుకున్న రహదారి..
వయసు..
విశ్వాన్ని పరిమళంతో నింపాలనుకునే
మల్లెపువ్వు..!
మలుపులు తిరుగుతూ..
సాగే దారంతా..
ఎన్ని పాదముద్రలో..
పదఘట్టనలో…!
అన్యాయమే….
తెలిసినా..
తరతరాలుగా..
మౌనాన్ని
ధరించడం..
దుమ్మునూ.. ధూళినీ
భరించడం..
రాళ్ళనూ.. ముళ్ళనూ..
సహించడం
అలవాటయిపోయింది..!
ఎదురుతిరగడం..
ప్రశ్నించడం..
డిక్షనరీలో లేవు..
గురువులెవరూ నేర్పించలేదు..
చదివిన పాఠాలలో కూడా కనబడవు..!
అడుగులకు మడుగులొత్తుతూ..
నడకలకు పూలుపేర్చుతూ..
ఆ చెప్పులకింద..
అణిగిమణిగి పడి వుండమన్నారు..!
అతనిని..
గమ్యానికి చేర్చే..
రహదారినై..
దాసినై..
వేశ్యనై..
ఆలినై..
తరించమన్నారు….
భరించే భూమాతవు
నీవంటూ నోరు మూయించారు..
ప్రపంచాన్ని పరామర్శించాలనుకునే నేను..
అగాధపులోయల్లోకి జారిపోతున్నాను
చివరికి..
అందమైన సమాధిగానే మిగిలిపోతున్నాను….!!