telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కనికరం లేని పెద్దలు..అంటరాని ప్రేమ

గాయాలు సలుపుతున్నా

గుండెలమీద

నీ పాదముద్రలనే కదా మోసాను

చావు ముసురు కోస్తున్నా

నీతో బ్రతుకునే కదా కోరుకున్నాను

ప్రియా ప్రోద్దటన్నం లో పెరుగేసి

నువ్వు పెట్టిన చద్దన్నం సాక్షిగా

నా చావుకు కారణం ఏమిటో చెప్పనా ?

ప్రియా నిన్ను ఇట్లానే పిలవాలని నీ నా గుండె

నెత్తురుల బాష ఎంత తన్నుకులాడాయో తెలుసా ?

చీకటి మాటున మన శరీరాలు

పెనవేసుకు పోయినప్పుడు కూడా

నిన్ను అమ్మగోరు అని పిలవడమే తప్ప

చచ్చిన దాకా కోరిక తీరనే లేదు

మీ వాళ్ళంతా నన్ను పట్టుకొని చెట్టుకు

కట్టేసి గొడ్డును బాదినట్టు బాదుతుంటే

జానపదం సినిమాలో రాజకుమారున్ని అనుకున్నాను నేను

సంగతేంది రా అని ఎవరయినా అడిగితే

నిన్ను ప్రేమించానని అరచి చెబుదామని మనుకున్నా

కానీ నేను దొంగనని రచ్చబండ ఆరోపణ

సాక్షివి నేవే కదా !

నాకు చచ్చిన శవాలను కాల్చడం తెలుసు

కానీ మీకు నన్ను బ్రతికుండగానే దహనం చేసారు

“తండ్రీ వీరేమి చేయుచున్నారో

వీరెరుగరు కనుక వీరిని క్షమింపుము”

అన్న ఫాదరీ గారు చెప్పిన ప్రభుమాటలు

గుర్తుకొస్తూనే ఉన్నాయి

మనం గడిపిన నిద్రలేని రాత్రుల సాక్షిగా

నీ కన్నుల్లో ఒక్క కన్నీటి చుక్క మెరిసినా

నిన్నూ నీ జాతిని క్షమించేవాడిని

గుండెల్లో నువ్వు రాజేసిన నిప్పుల కుంపటి

వంటిమీద నీ వాళ్ళు అంటించిన కిరసనాయులు మంటలు

ఈ రెండింట్లో ఏది ఎక్కువ బాధ అని అడిగితే

నేను ఏమీ చెప్పలేను ప్రియా

ఈ మంటలు నన్ను అలుముకుంటుంటే

నువ్వు నన్ను వాటేసుకున్నట్లే ఉంది.

Related posts