telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పయనం

ఆకాశాన్ని చూస్తూ
నేను మాత్రమే ఉండేవాడిని
ప్రకృతి ఒడిలో
ఎన్ని చుక్కలు
చంద్రునితో సహజీవనం చేస్తే
ఆకాశాన అంతటి పండువెన్నెల కాస్తుందో…
ఎగిరే పక్షుల కిలకిలలే ఆలాపనలై
పట్టుదారాల్లా ప్రవహించేవి…
పుష్పాల్లోకి రహస్యంగా ప్రవేశించే
పరిమళాల్లా
నాలోకి నేనే లీనమైపోతుండేవాడిని…
కానీ ఇపుడు
నా మనో తరంగాలలో
కిలకిలారావాలు
అల్లకల్లోలమై భీకరంగా…
తడిచిన ఓ మంచురాత్రిలోని చీకటి
నా దేహాన్ని ఆక్రమించుకుంది
నన్ను నగ్నంగా నిలబెట్టడానికేనేమో…
ప్రాణంలేని ఓ రాతిపూవును ఆశించాను
స్త్రీ నగ్న దేహం చూసినప్పుడు
మోహమో వ్యామోహమో…
ఎందుకంతగా కాంక్షించానో కూడా
తెలియక కలిగిన అశాంతి
నాలోని ఉనికికది మృత్యువును
పరిచయం చేసి లిఖించిన మరణశాసనం
చిరు దరహాసమూ వీడ్కోలు పలికింది
ఏమీ తెలియని శిశువులా…
నా అస్థిత్వానికీ శిలువ వేసింది
నాలోంచి నన్ను బయటకూ లాగింది
నాకోసం కాసిన ఆ పండువెన్నెల
చీకటి పిడికిళ్ళలో నలిగిపోతుంటే…
గాయాలు తడుపుతున్న
గుప్పెడు కన్నీటిని చేతబట్టుకుని
ఇపుడు తాగుతూ కూర్చున్నాను
కనిపించని ఏ ఆధారంతోనో
నా పయనం ఏమౌతుందో…ఎటుపోతుందో

Related posts