telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చందమామ

ఈ సుందర మనోహర ప్రపంచంలో
రెండు మనసులు చేరే స్వర్గం పేరే ప్రేమ
కలిసిన రెండు మనస్సులో పొంగే
అమృతవాహిని ఈ ప్రేమ
ఆ ప్రేమే నన్ను వెతుక్కుంటూ
” అందరాని చందమామ ” లా నన్ను హత్తుకుంటోంది
వలపుల బృందావనిలో రసడోలలూగిస్తోంది
మల్లెల పన్నీరులను చల్లుతోంది
వెన్నెల్లో మంగళస్నానాలు చేయిస్తోంది
ఊహల పల్లకిలో తేలుస్తోంది
కన్నె ప్రాయానికి వన్నెల రూపమై
యదలో అమృతాన్ని నింపుతోంది
వేచిన వలపుల లోగిలిలో
నాకోసమే వచ్చిన అనార్కలిలా
సరసన చేరి విరితేనెలలో తేలిస్తున్నది
సుర భోగాలనే అందిస్తున్నది
నా పక్కనే నిలబడి వసంతాలు పూయిస్తోంది
చుక్కలనే తెచ్చి నాకు మెరుపులద్దుతోంది
ఆ జాబిలినే తెచ్చి సిగలో తురుముతోంది
అంతేలేని అనురాగాల ఒడిలో లాలిస్తోంది
ప్రియుడి ఒడిలోని హాయేంటో కొసరి కొసరి చెబుతోంది
యదను మీటి కళ్యాణ రాగాలను పలికిస్తోంది
అంతలోనే ” అందరాని చందమామలా “
అల్లంత దూరమై పోతోంది
ఈ అల్లరి పేరే ప్రేమా
ఇలా కమ్మగా ఊరించడమే ప్రేమకున్న గుణమా…

Related posts