telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మానవ జీవన శైలి….

మానవ జీవన శైలి….
చీకటి వెలుగుల రంగేళి!
కష్టసుఖాల కేళి!
ఆగర్భ శ్రీమంతులమని
అవసరం ఉన్నా లేకపోయినా
అతిగా శరీరాన్ని సుఖపెడితే
కష్టాల్ని..తట్టుకోలేకపోవచ్చు!
డబ్బు ఉందని
డిజైనర్ దుస్తులని
దుబారా చేస్తే….
దేహం కప్పుకోవడానికి
దేహీ అనవలసిన
దుర్దినం రావచ్చు!
పదుల పడక గదులతో
భారీ భోజన హాలులతో
అందమైన అతిధి గదులతో
చిత్ర ప్రదర్శన సౌకర్యంతో
వినోదాల వాకిలితో
ఈత కొలనులతో
పచ్చిక బయళ్ళుతో
అంతఃపురాలు నిర్మించి
అతిశయంగా ఉంటే
తలదాచుకోవడానికి
తడిక కూడా లేని
తరుణం రావచ్చు!
విపరీతంగా డబ్బుఉందని
విందులు.. వినోదాలంటూ
అకలున్నా.. లేకున్నా
అదేపనిగా మెక్కుతూ
అజీర్ణం తెచ్చుకుంటే….
ఆకలి తీర్చుకోలేని
విపరీతి స్థితి రావచ్చు!
ఒక్క మెతుకూ తినలేని
విపరీతం రావచ్చు!
తిందామనుకున్నా….
తిండి దొరకని
దయనీయ స్థితి రావచ్చు !
పైసలున్నాయని
పార్టీలంటూ.. పబ్బులంటూ
మితిమీరి మద్యం తాగితే….
మనుగడే మాయం కావచ్చు!
మనుగడ సాగించినా….
మంచినీరు కూడా దొరకని
మాయ కాలం రావచ్చు!
కాసులున్నాయని
కోట్ల ఖరీదు కారుకొని
ఖుషీగా తిరిగితే
కాలినడక పోవలసిన
కాలం రావచ్చు !
దుర్మార్గాలు చేసి
ధనం గడించి
దర్జాలు వెళ్లబోస్తూ
దేహాన్ని అతిగా సుఖపెడితే
ఎదో ఒకరోజు….
న్యాయం గెలిచి
జైలులోకి నెట్టబడితే…..
చిప్ప కూడే.. గతి కావచ్చు !
ఒదిగి ఉంటే….
విజ్ఞతతో వ్యవహరిస్తే….
కష్టాలు ..నష్టాలు
కన్నీరు చిందించలేవు!
తామరాకుపై నీటి బొట్టులా….
తరలిపోతాయి !
సామర్ధ్యం ఉందని ..,సంపద ఉందని
సుఖాల్నివంట బట్టించుకుంటే….
బాధలు..వ్యధలు భయపెట్టేస్తాయి!
బ్రతుకు గమనాన్నే.. దుర్భరం చేస్తాయి !

Related posts