telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మారని తలరాతలు

మళ్ళీ ప్రాణం పోసుకుంది

పేదతల్లి గర్భంలో మరోజీవి

ఎంతటి ఆతృతతో వచ్చిందో

ఆశలు ఆవిరైపోయే జగతిలోకి

నాగరికపు విలువలకు జడిసి

భయంతో గుక్కపెట్టి ఏడ్చింది

 

గులక రాళ్ళమధ్య,ముళ్ళ తుప్పల మధ్య

అదే ప్రపంచంగా జీవిస్తూ….

అస్తి పంజరంగా మారిన అమ్మ

స్థన్యం నుండి రాని పాలనే..

ఆబగా తాగి సగం ఆకలిని తీర్చుకుని

ప్రాణాలను నిలుపుకుంది బాల్యం

 

పెరుగుతున్న కొద్దీ ఎన్నో ప్రశ్నలు

ఎన్నో రకాల ఆకలి పోరాటాలు

ఎన్నెన్నో అర్థంకాని అగ్ని పరీక్షలు

ఎన్నో ఆత్మాభిమానాన్ని చంపుకొని

బ్రతికే అర్థంలేని అతుకుల బ్రతుకులు

కన్నీటిని దిగమ్రింగే కన్నీటి గాథలు

 

తరతరాలుగా,యుగయుగాలుగా

పేదవాడి తలరాతను వ్రాస్తున్నదెవరు

రాత్రిం బవళ్ళు కష్ట పడుతున్నా

కడుపు నిండని జీవితాలను వారికి

వారసత్వంగా కట్టబెట్టింది ఎవరు

ముక్కు పచ్చలారని పసిమనస్సులో

అంతరాల బీజాలు నాటుతున్నదెవరు

 

ఎన్ని తరాలుమారినా మారని తన

తలరాతను మార్చుకోలేక…..

జవాబులు దొరకని ప్రశ్నలతో అలాగే

ఎప్పటిలా తరలి పోతుంది జీవితం

మరో తరానికి అవే కన్నీటి గాథలను

మరపురాని రాచ బాటలుగా వేస్తూ…

 

ఆ విధాతను ప్రశ్నించలేదు ఎన్నడూ

విధి రాతకు తలవంచిన జీవితాలు

అలుపెరుగని ఆ సామాన్య కష్ట జీవులు

రెక్కలు ముక్కలు చేసుకున్నా నిండని

ఖాళీ కడుపును తమ కన్నీటితో నింపుకునే

అసమాన ధైర్యసాహసాల ధన్య జీవులు

Related posts