telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రంగులు మార్చే.. ఊసరవెల్లి

నేనొక ఊసరవెల్లిని

ఇంట్లో ఉంటే టీషర్టు,లుంగీ

బయటకెళ్ళేప్పుడు ప్యాంటు,షర్టు

ఏదైనా పదిమందిలోకైతే ఇంకాస్త ఖరీదైన డ్రస్సు

నేను బట్టలు మార్చే ఊసరవెల్లిని

ఇంట్లో మాసిన గడ్డమైనా పర్లేదు

బయటకెళ్ళే పనుంటే క్లీన్ షేవ్

ఫంక్షన్ అయితే హెయిర్ డై కూడా

నేను గెటప్పులు మార్చే ఊసరవెల్లిని

ఊరివాడు ఎదురైతే ఏరా బాగున్నావా

బయటివారు ఎదురైతే ఏమండీ బాగున్నారా

పై ఆఫీసరు ఎదురైతే ఏం సర్ బాగున్నారా

నేను మాటలు మార్చే ఊసరవెల్లిని

పనివాడొస్తే నిలబెట్టి మాట్లాడతా

పైవాడొస్తే కూర్చోబెట్టి మాట్లాడతా

ఆపైవాడొస్తే నిలబడి మాట్లాడతా

నేను పద్ధతులు మార్చే ఊసరవెల్లిని

సైకిల్ పై వెళుతుంటే ఓ బీదనవ్వు

మోటారుసైకిల్ పై వెళుతుంటే భలేనవ్వు

కారులో వెళుతుంటే ఓ కల్తీనవ్వు.

నేను నవ్వులు మార్చగల ఊసరవెల్లిని

నన్ను చూసి

ఊసరవెల్లి కూడా

ఏ రంగు మార్చుకోవాలో

అర్ధం కానంత

రంగు రంగుల ఊసరవెల్లిని

Related posts