telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఉరి…తప్పెవ్వరిది…?

ఊరి బయట పూరిపాకలో 

ఉతికిన బట్టలు ఎక్కడ అరవేయాలో తెలియక

మాయమ్మ ఆలోచిస్తుంటే..

అప్పులు బాధ తాళలేక

పిల్లలకు పండగ పుట కొత్త బట్టలు కొనలేని స్థితిలో

ఊరి చివర విద్యుత్తు తీగలకు వేలాడుతున్నాడు

మా అయ్య.

చినుకు జారక పుడమి బీటలు వారుతుంటే

కన్నీటితో నేలను తడిపి..దుక్కి దున్ని విత్తునాటి..

మొలకలు వంక ఆశగా చూస్తూ..

తన కష్టాలు తీరుననే ఆశలను కీటకాలు కొరికేస్తుంటే..

నమ్ముకున్న పురుగుమందులు క్రిములను చంపుకోలేక మాలోని కల్తినీ నువ్వుగుర్తించలేవా 

అంటూ పరిహశిస్తుంటే..

అదే పురుగులు మందుతో ప్రాణాలు విడిచిన

సగటు రైతును చూసి నింగి కంటనీరు పెడుతుంది.

తన బిడ్డకు ఎన్నికష్టాలో అనుకుంటూ…

ఆరుగాలం కష్టపడి పండించిన పంట

పట్నంలో అమ్మకానికి పెడితే..

గింజల్లో తేముందంటూ,తాలు శాతం ఎక్కవంటూ

పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదంటే.

పండించిన పంట పొలంలోనే

నీడనిచ్చిన చెట్టుకు ఉరితాటితో ఊయలూగుతున్న మధ్యతరగతి రైతు ఎదలో బాధను చూడలేక

ఆకాశం మేఘాలు మాటున దాగింది..

ప్రకృతిని ఆరాధించలేని మనిషి బ్రతుకు ఇంతే నంటూ…

 

 

Related posts