telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గూటిలోని గువ్వ..

నేలపై పడిన ఒక విత్తనం
మొలకెత్తుతోంది..
లోకాన్ని చూడాలనే తాపత్రయంతో…!
మోడైన మాను చిగురిస్తోంది..
జీవించాలనే ఆరాటంతో…!
గూటిలోని గువ్వ..
రెక్కలు కట్టుకుని పైకెగురుతోంది..
ఆశల పోరాటంతో…!
నిన్న కోల్పోయినదేదో..
జగతిలో వెతుక్కోవాలనే కాంక్షతోనే కదా..
ప్రతిరోజూ.. ఉదయిస్తున్నాడు సూర్యుడు…!
పుడమిని తడిచేసి…
ఆ ఒడిలో ఒదిగి పోవాలనే కదా..
చినుకు.. ఆకాశంనుండి రాలుతోంది…!
ఏదో ఒక ఆశ..
ఈ సృష్టికి జీవం పోస్తోంది…!
లేకపోతే…
అణగారిన ఆశలతో.. కుంచించుకుపోయి..
బోన్సాయ్ మొక్కలలా..
జీవించే వాళ్ళమేమో….!
మరణం చుట్టూ పరిభ్రమించే జీవితం…
ఆశలకు నిచ్చెనలేయించి..
అడుగులు ముందుకు వేసేలా చేస్తోంది..!
రేపనే రోజున.. కాలం..
సంతోషాన్ని కాస్త..
కొంగున మూటకట్టుకుని తెచ్చి
అందిస్తుందనే ఆశతోనే మనం..
ముందుకు నడవాలి …!!

Related posts