telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నిద్రపట్టనివ్వని కలలు..ఆలోచనలు

ఆశల బహుళ అంతస్థుల భవనం 

ఒక్కసారి గా కుప్ప కూలుతుంది

నెత్తురు కారదు 

ఒంట్లో నెత్తురు చుక్క మిగలదు

కన్నీరు జారదు 

దుఃఖ మంతా

కళ్ల లోనే ఆవిరై పోతుంది

బహుశా ఆ ఆశల బహుళ అంతస్థుల భవనం 

నాసిరకం ఆలోచనల తో

నిర్మింపబడి ఉంటుంది

డక్కి మొక్కీలు తినుంటుంది

ఆలోచన ల్లో కూడా 

బలమైనవి / బలహీన మైనవి ఉంటాయా?

మనుషుల్లాగే

జాతుల్లాగే

నేను ఎందుకు బలహీనం గా ఉన్నానో నా కన్నా

నన్ను పీక్కు తిన్న బలవంతునికే బాగా తెలుసు

 

మూల వాసి ఎవడో

మురికి వాడల వాసి ఎవడో

దేశీ ఎవడో

విదేశీ ఎవడో

బానిసలు ఎవరో

రాజులు ఎవరో

చరిత్ర రంకు రాతల్లో మూగ బోతుంది

 

ఊహలు, ఊసులు ముక్కలు చెక్కలు అవుతాయి

ఊపిరి ఒక్కటే అనాథ గా

బతుకు శిథిలాల మధ్యలోంచి

అర్థ రాత్రి తలెత్తుకుంటుంది

 

అసలు హీరో నడి రోడ్డు మీద

ఆకలితో అలమటిస్తూ

చీకటి తో పోరాడుతుంటాడు

వాడికి జేజేలు, జయధ్వానాలు అక్కెర లేదు

 

ఆకాశమే కప్పు

భూమే ఇళ్ళు

చెట్ల నీడ లే గదులు

ఫుట్ పాత్ లే హాల్ లు

ఎంతో విశాలమైన నివాసం, ఆవాసం..

ప్రతి గోడ /నీడ 

వాడిదే

అందరు రేపటి ఉదయం 

మేల్కోవడానికి

నిద్ర పోతున్నారు

హీరో ఉదయానికల్లా 

నిద్ర పోవడానికి మేల్కొని ఉంటాడు

కలలు నిద్ర పట్ట నివ్వవు  

దాహం తీరేందుకు, తీర్చేందుకు

మురికి కాలువ లు జీవ నదుల్లా పారుతుంటాయి..

ఇక తిండి అంటావా 

రెక్కాడితే కానీ డొక్క ఆడదు

వీడి డొక్కలు ఎండితే

గాని ఏలికల డొక్కలు నిండవు

 

 

Related posts