ఎవరు పెట్టిన శాపమది
ఎవరు తెచ్చిన సంప్రదాయమది
ఎవరన్నారది వరమని
అనాది నుండి ఆడదాన్ని కాటేస్తూ
కాటికి పంపుతున్న సర్పమది
సమాజాన్ని పట్టి పీడిస్తున్న పిశాచమది
వధువు కన్నీళ్లతో బేరం చేస్తూ
కన్నవారి రక్తాన్ని కాసులుగా మార్చుకుంటూ
కడుపునిండా కూడైనా తినకుండా కూడబెట్టిన ధనాన్ని కట్నాలు,కానుకల పేరిట నిలువుదోపిడీ చేస్తున్న ఈ దుర్మార్గపు సంప్రదాయాన్ని ఎవరు తెచ్చారు
కూతురు పెళ్లికోసం కడుపు పండించిన తాళిబొట్టును అమ్ముకున్న తల్లులెందరో
కూతురు కట్నంకోసం నిలువ గూడైనా లేకుండా తెగనమ్ముకుని రోడ్డుపాలైన తల్లితండ్రులెందరో
అగ్నిసాక్షిగా పెళ్లాడి అదే అగ్నికి కట్నం తక్కువైందనో,ఇంకా కావాలనో నిన్ను ఆహుతి చేస్తుంటే ఈ నరకయాతనని ఇంకా భరిస్తావా?
ఓ స్త్రీ ఇకనైనా మేలుకో
ఎన్నాళ్ళు ఈ దురాచారానికి బలవుతూ కన్నీళ్లని కారుస్తావు, చరిత్రని మార్చే శక్తి నీలో ఉంది ఉద్యమించు ఆవేశం చల్లారే దాకా కాదు,అనుకున్నది సాధించేదాకా
విశ్రమించకుండా భద్రకాళిరూపాలై,
ప్రళయాగ్ని గోళాలై కదలండి
వరకట్నం లేని సమాజాన్ని నిర్మించండి..