telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనాననంతర నూతనుడు !

ఉపయుక్త నిరుపయుక్త సూత్రం
కొత్తజీవి పుట్టుకపరిణామ వాదం
ప్రకృతిలో ఊహించని మార్పులతో
ఉపయోగం లేనిభాగాలు లుప్తమై
ఉపయోగించే అంగాలు వికసించి
నూతనజీవిగా ఆవిష్కృతమవటం
‘లామార్క్’ శాస్త్రీయ సిద్ధాంతం !
కరోనా కట్టడి కాలాన
కాలుకదపలేక మనిషి నిస్సత్తువలో
సంబరాలు, సభలు, పండుగలు
చావులు, శోకాలు, పెళ్లిళ్లు
పలకరింపులు నిర్జీవంగా
చరవాణీతెరలపైనజరిపేస్తున్నాడు!
బడుగు బ్రతుకులు మాత్రం
నమ్ముకున్న రెక్కలను మూటచేసి
ఊరిలోని పొలాన్నేనమ్మి కదిలి
పల్లెదారి సాగిపోయారు !
నగర జనారణ్యంలో మాత్రం
సగటు జీవి జలదరించే
కలల మగతలో
నిద్ర కరువై కలతనిద్దురలోంచి
లేచింది మొదలు చిన్నదో పెద్దదో
తెరలకు కళ్ళను అతికించి
వాస్తవాలు దాచిన వార్తలతో
ఊహకు అందని గబ్బు సీరియల్స్
అరిగిన ఎపిసోడ్లతో ఒంటరిగా
కదలకుండా కన్నార్పకుండాచూస్తూ
…ఊబ కాయుడవుతున్నాడు !
మనసు మాత్రం మోయలేని
ఉద్విగ్నలతో,విపరీత ఆలోచనలతో
భయాల చీకట్లను భరిస్తూ నేటి సుడిగుండాలవలయాల నుండి
ఎగిరి బయటపడే మార్గాలను అన్వేషిస్తూ *అధిమానవుడవుతున్నాడు !
అయినా సరే శరీరాన్ని మాత్రం
సుప్తత జాడ్యానికి బలి చేయక
రేపటి కొత్త జీవనానికి
పరిణతి చెందిన మనసుకు
సరి జతగా ప్రతి అంగం ఆరోగ్యంగా
ఉపయుక్తంగానే ఉంచగలగాలి!
వైద్యం, సాంకేతికత, విజ్ఞానం
ఎదిగి ఆకాశాన్ని తాకినా
మనిషి ఉనికి సాటి మనిషితోనే
ముడివేసుందనే జీవన పాఠం
నేర్పిన గురువు నేటి మహమ్మారి !
మానవతను మరిచిన బ్రతుకు
మృతప్రాయమేనని తెలిసి
మట్టినుండి ఎదిగి భౌతికంగా
ఎంత ఎత్తులకు ఎగప్రాకినా
మనిషి మట్టిలోనే కలిసిపోవాలని
మిగిలే మనిషివాసనే
శాశ్వతమని మసలుకుంటూ
కరోనానంతర నూతన మానవులమై కొత్త
జగతిలో గర్వంగా ఆవిర్భవించాలి !

Related posts