telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

” కరోనా కలికాలం “… కాటికి పోయే కాలం

కాలం ఒడిలో కరిగిపోయే దివ్వెలం..!!

కాలానికి ఖరీదు కట్టలేని బ్రతుకులం..!!

కాల ప్రవాహంలో కొట్టుకుపోయే నీటి బుడగలం..!!

గడిచిన కాలాన్ని మార్చలేం..!!

గడుస్తున్న కాలాన్ని నిర్ణయించలేం..!!

చేజిక్కించుకోవాలన్న భవిష్యత్తుని ఊహించలేని,

భావితరాల పౌరులం..!!

అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ,

అనవసరమైన వాటి కోసం పాటుపడుతూ,

నీ ఉనికిని నువ్వే మరిచిపోయే అంత తాపత్రయ పడుతూ,

అంతా నాదే , అంతా నా వారే అని భ్రమిస్తూ,

అశాశ్వతమైన బంధాల కోసం పాకులాడుతూ,

ఉన్నది ఏదో, ఉంటున్నది ఏదో గుర్తించక ,

పోగొట్టుకున్నది రత్నాలని గమనించలేక ,

అంతా అయిపోయిన తర్వాత విలపిస్తూ వచ్చేదేమీ లేదు.!

కారుచిచ్చులో కాలి మిగిలిన మసి తప్పా..!!

కరోనా సమయంలోనైనా కళ్లు తెరవండి..!!

కోరలు చాచిన కరోనా నాగు కాటువేసే లోపల,

కరోనా విష వలయంలో బలి కాకుండా చూసుకోండి..!!

ఒక ప్రక్కన రోజురోజుకీ పెరుగుతున్న కరోనా ,

ఎంతో మందిని బలి తీసుకుంటుంటే,

చివరి చూపుకి కూడా నోచుకోలేని అభాగ్యులమయ్యాము..!!

ఏ దేహమెవరిదో తెలియని శవాల గుట్టలకు

ఎవరు వచ్చి చేస్తున్నారు అంతిమ సంస్కారం..?

ఏ మత నియమాలను అనుసరించి చేస్తున్నారు..?

ఈ కర్మకాండలు..?

ఏదో చేస్తే స్వర్గప్రాప్తి..!!

ఏమీ చేయకపోతే నరకం..!!

ఏమైపోయాయి? కుల మత ఆచార సంప్రదాయాలు..?

ఏ దేవుడు వరమీయనున్నాడు..!!

పుట్టిడు నల్లపూసలు పుటపుటా తెగిపోతుంటే,

ఏ దేవత వ్రతంచేయాలి..!!

తప్పిదమో..! మానవ తప్పిదమే..!

ఏమో..? ఏమనాలో..?

నా భరతమాత కన్నీరు తుడిచేదెవరు..?

ఈ ప్రళయం ఎప్పటి వరకు ..?

అంతమనేది లేదా..?

    

       

Related posts