telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలి!

ఇంటిలో చనిపోతున్నారు

అంబులెన్సులో అంతమైపోతున్నారు

ఆసుపత్రి పార్కింగ్ లో పోతున్నారు

బెడ్ మీద బలై పోతున్నారు

బెడ్ దొరకకపోతే …

వరండాలో ..విగతజీ వులవుతున్నారు!

స్మశానంలోనైనా….

చోటు దొరుకుతుందనుకుంటే

నిరాశే మిగులుతుంది… !

భూమిలోకలవడానికి కూడా

బూడిదగా మిగలడానికి కూడా

భారంగా ఎదురు చూడాల్సి వస్తుంది!

 

రాజకీయ వాదినిగాను…

ఎన్నికలసభల్లో …

ఏకరువు పెట్టడానికి !

చిత్ర కథానాయకుడనుగాను…

ఆడియో ఫంక్షన్లో …

అభిమానులతో ముచ్చటించడానికి

మహమ్మారికి భయపడి…

ముఖానికి మాస్కు తగిలించుకుని

మూలన కూర్చున్న .. మామూలు మనిషిని !

అందుకే …. 

ప్రార్థనలంటూ…

ప్రజలు గుమికూడితే.. నాకెందుకు!

మేళాలంటూ…

మూకగా మెలిగితే ..నాకెందుకు!

పుట్టిన రోజంటూ…

పడి పడి దొర్లితే.. నాకెందుకు !

బ్లాక్ బస్టర్ అంటూ…

మూకలో సినిమా చూస్తే ..నాకెందుకు!

 

మహమ్మారి వచ్చినవారితో

మూకగా ఉన్నవారందరికి

ప్రభుత్వం పరీక్షలు చేస్తుందోలేదో

నాకైతే తెలియదు…!

పరీక్షలు చేయకపోయినా…

నేను చేయగలిగింది ఏమీలేదు!

 

మందగా మసలుతున్నవారిని …

పోలీసులు అడ్డుకోగలుగుతున్నారోలేదో

నాకైతే తెలియదు…!

అడ్డుకోలేకపోయినా…

నేను చేయగలిగింది ఏమీలేదు!

 

మార్కెట్ కు వెళ్లిన వారందరూ…

మాస్కులు వేసుకుంటున్నారోలేదో

నాకైతే తెలియదు…!

వేసుకోకపోయినా…

నేను చేయగలిగింది ఏమీలేదు!

 

బయటకు వెళ్లినవారందరూ…

సామాజిక దూరం పాటిస్తున్నారోలేదో

నాకైతే తెలియదు…!

పాటించకపోయినా

నేను చేయగలిగింది ఏమీలేదు!

 

పౌరులందరూ…

పరిశుభ్రత పాటిస్తున్నారోలేదో

నాకైతే తెలియదు…!

పాటించకపోయినా…

నేను చేయగలిగింది ఏమీలేదు!

 

మహమ్మారి రోగానికి…

మందుఉందో లేదో

నాకైతే తెలియదు…!

మందు లేకపోయినా…

నేను చేయగలిగింది ఏమీలేదు!

 

నేను చేయగలిగందల్లా…

అన్ని జాగ్రత్తలు పాటిస్తూ

అన్యుల అజాగ్రత్త

నాపై ప్రభావం చూపకుండా

కరోనా కాటేయకుండా

మహమ్మారి బారిన పడకుండా

నన్ను నేను కాపాడుకోవడమే !

Related posts