telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఓ చినుకా రా…!

నేను పుడమిని
దాహంతో దహించిపోతూ
నీటి చుక్క కోసం నోరెళ్ళబెట్టి
ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నాను
నా ప్రియుడు నీలిమేఘుడు వస్తాడనీ
తన చల్లని స్పర్శ అందిస్తాడనీను…
పొడారిపోయిన గొంతూ
తడారిపోయిన గుండే
నీ విలువను విపులంగా వివరిస్తున్నాయి
నా ప్రాణానికి నీవే ప్రాణమని…
చినుకు పడితే తనువంతా తడిపేసుకోవాలనీ
ఉదరం నిండా నింపేసుకోవాలనీ
ఆశగా ఎదురు చూస్తోంది
ఎండిన తటాకంలాటి నా మనసు
నీ రాకకోసం నా దాహార్తి కోసం…
నీ ప్రియుడొస్తున్నాడని ఆకాశవాణి వార్త తెస్తే
నాకోసమేనని ఆర్తిగా ఎదురు చూసాను
సంపూర్తిగా నా దాహం తీరుస్తావనీ
నాదేహంలోని తాపం చల్లారుస్తావనీను…
నీ ఆత్మీయులెవరో ఆపదలో ఉన్నట్టుగా
నేనసలు నీదాన్నే కానట్టుగా
నీ వెక్కడికో వడి వడిగా వెళుతున్నావు
నా వైపు చూచీ చూడనట్టుగా
చూచినా నేను నీకు తెలియనట్టుగా…
ఎండిపోయిన కొమ్మల్లా
నా ఆశలు విరిగిపోతున్నాయి
పండిపోయిన ఆకుల్లా
నా కోరికలు రాలిపోతున్నాయి
నీ చేతలకీ… నీ పోకడాకీ…
ఎక్కడో జీవమున్న మొక్కలా విలవిలలాడుతూ
ఎండిన రెక్కలుచాపి అడుక్కుంటున్నాను
దిక్కులేని అనాధలా… నీముందు కడుపేదలా…
అయినా నీవు ఓరకంట చూస్తూనే వెళుతున్నావు కానీ
ఒక్క నీటిచుక్కయినా నా గొంతులో ఒంపలేదు
భార్య పక్కనున్న భర్తలా
నన్ను మరచిపోయిన మాజీ ప్రియునిలా…
నీవు ప్రేమించినప్పటి దయాగుణం
ఇప్పుడు మచ్చుకయినా నీలో లేదు
ఎవరో దోచేచినట్టుగా
లేదా నీలో దాచేచినట్టుగా…
నువ్వు పోతూ పోతూ చెయ్యయినా విధిలిస్తావనీ
కన్నైయినా కదిలిస్తావనీ కాచుకు కూర్చున్నాను
మన గతాన్ని తలసుకొంటూ
నిరాశను పొమ్మనీ… ఆశను రమ్మనీ…
నా ప్రేమ పాపం చేచిందన్నట్లుగా
నీవు పరుగు పరుగున పోయి
పరాయినేలను తడిపావు
నాపైఉన్న కోపంతోనో…
నీలో ఉన్న ధు:ఖంతోనో…
వాడిపోతున్న మొక్కకు ఇంకా ఎండతగిలినట్టుగా
నా హృదయం ఎండిపోతుంది
పగుళ్ళు తీసిన బీడుభూమిలా
నా శరీరం పగిలిపోతుంది
నా నిట్టూర్పుల వేడికి నా గుండె మండిపోతుంది…
ఓ నీటిచుక్కా…!
ఇప్పుడు నేను “మమ్మీ”ని
నన్ను బ్రతికించగలవా…?
నా అంగాంగానికీ శృంగారాన్ని అద్ది
మన సంగమం మళ్ళీ సాగించగలవా…?
అది నీకు సాధ్యమే…
ఓ చినుకా…! నువ్వు నన్ను పలకరిస్తే
గట్టిబెడ్డలాటి నేను పులకరించిపోయి
మట్టి ముద్దలా నీ చేతిలో ఒదిగిపోనూ…
సస్యశ్యామమైన మన గర్భఫలములను
సగర్వంగా నీకందించనూ…
నేను చేసిన పాపమేమిటో ఇకనైనా చెప్పు
నీ మనసులోన మాటను విప్పు
నీ అనురాగపు జల్లు నాపై కప్పు
ఓ చినుకా రా…!

Related posts