ఎంత అమానుషం…!
ఎంత అవివేకం…!
దేశాల సామర్ధ్యాలను
విధ్వంసక శక్తితో కొలుస్తున్నాం!
దేశాల శక్తి యుక్తులను
దేశాలు దహించగల
దేహాల సంఖ్యతో పోలుస్తున్నాం!
దేశాల గొప్పతనాన్ని
అవి.. నాశనం చేయగల
ఆస్తులతో లెక్కేస్తున్నాం!
అణు బాంబులు
హైడ్రోజెన్ బాంబులు
ఎఫ్ పదహార్లు ,స్టెల్త్ బాంబర్లు
క్షిపణులు ,క్షిపణి రక్షక వలయాలు
బయలాజికల్ ఆయుధాలు
బంకర్ బస్టర్ బాంబులు
విమాన వాహక నౌకలు
జలాంతర్గాములు….
ఇవేనా కొలమానాలు…?
శక్తి సామర్ధ్యాల నిర్ధారణకు
మానవ మేధస్సుకు
మనిషి విజయాలకు
మానవ జాతి పురోగతికి….
మానవాళిని మసి చేయగల….
మిస్సైళ్ళను
బ్రతుకులు బూడిద చేసే….
బాంబులను
జీవులను నిర్జీవులు చేయగల….
జీవాయుధాలను
రాజ్యాలను రక్త సిక్తం చేసే….
రసాయన ఆయుధాలను ….
కొలమానాలుగా కొలుస్తున్నాం…!
ఎంత మూర్ఖత్వం !
మానవ మనుగడను
ప్రపంచం ఉనికిని
ప్రశ్నార్ధకం చేస్తున్న
ఈ విద్వంశక శక్తి….
మనకవసరమా ?
తగలబడిపోతుంది….
తరతరాలుగా పోగేసిన
జ్ఞానం,విజ్ఞానం !
సంపద ,సంస్కృతి!
మరో జీవి పుట్టటానికి
మరో మొక్క మొలవటానికి
అవకాశమే ..లేకపోవచ్చు!
బలవంతుడే జీవనార్హుడనే
ఆటవిక సూత్రంనుండి.. బయటపడి
సంఘ జీవనం నేర్చుకుని
సజావుగా ,యుగయుగాలుగా
సహజీవనం చేస్తుంటే ….
శక్తే సమస్తమంటూ
దేశాలు ఢీ అనుకుంటూ
వినాశనం వైపు అడుగేయటం…
వివేకమేనా ?
మనుషులను పీడించే
మాయరోగాలనుండి
విముక్తి చేయటానికి
బ్యాక్తీరియా, వైరస్ పై
పోరాటం చేయటానికి
వాక్సిన్ల తయారీతో
మొదలైన శాస్త్ర విజ్ఞానాన్ని
అదే బ్యాక్తీరియా వైరస్ లను
జీవాయుధాలుగా మార్చి
యుద్ధంలో ప్రయోగించటానికి
ఉపయోగిస్తున్నారు…
ఎంత విచిత్రం !
దారిద్య్రం ,అనారోగ్యం
ఆకలి ,నిరక్షరాస్యత
వృద్ధాప్యం ,వైకల్యం….
వీటిపై పోరాటం సలపక ….
నిన్ను నీవు చంపుకుంటున్నావు….
మతిమాలిన మనిషీ !
దేశాధినేతల్లారా… !
కరుడు కట్టిన జాతీయవాదాన్ని
కాటికి సాగనంపి
మంచిచేసే మానవతావాదానికి
మకుటంపెట్టి
మారణహోమంనుండి
మానవాళిని.. రక్షించండి!
ఏపీలో ప్రతీకార రాజకీయాలు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు