క్యూబెక్‌కు చెందిన ఓ కుటుంబం విహారయాత్ర కోసం ఫ్లోరిడా వెళ్లగా… అది విషాదాంతమైంది. లూయిస్ అనే వ్యక్తి తన భార్య, తండ్రితో కలిసి ఫ్లోరిడా యాత్రకు బయలుదేరాడు. లూయిస్ తండ్రి వయసు 87… ఆయన పేరు ఫెర్రాండ్… తండ్రిని ఒక్కడినే ఇంట్లో వదిలి వెళ్లడం ఇష్టంలేక తమతోపాటు తీసుకెళ్లారు ఆ దంపతులు. కారులో ఫ్లోరిడా వచ్చిన ఆ కుటుంబం కొంతసేపు నగరంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించింది. అయితే అప్పుడే అనుకోని ఓ సంఘటన జరిగింది. వెనుక సీట్లో కూర్చొని కొడుకు, కోడలితో సరదాగా మాట్లాడుతున్న ఫెర్నాండ్ ఒక్కసారిగా గుండె పట్టుకొని పక్కకు ఒరిగిపోయారు. ఇది గమనించిన లూయిస్ వెంటనే కారు ఆపేసి, వెనక సీట్లో ఉన్న తండ్రికి ఏం జరిగిందో పరిశీలించాడు. పెర్నాండ్ హఠాత్ మరణానికి లూయిస్ ఖంగుతిన్నాడు. తన తండ్రి మరణించినట్లు నిర్ధారించుకున్న ఫెర్నాండ్ కారులో ఇంటికి బయలుదేరాడు.
ఫ్లోరిడా నుంచి క్యూబెక్ కు కారులో తిరిగి వస్తున్న వీరిని మధ్యలో ఎక్కడా పోలీసులు అడ్డుకోలేదు. కానీ కెనడా సరిహద్దు వద్ద కాపలా కాస్తున్న అధికారులు మాత్రం వారి కారును ఆపి, తనిఖీ చేశారు. లోపలున్న శవం విషయమై ఆ దంపతులను ప్రశ్నించగా… లూయిస్ జరిగిన విషయాన్ని అధికారులకు వివరించి, ఫ్లోరిడా ఆస్పత్రుల్లో అడిగే ఫీజు తాము కట్టలేమని, అందుకే తమ స్వదేశానికి తిరిగి వచ్చామని చెప్పాడు. అయితే పోలీసులు అనుమానంతో ఫెర్నాండ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టంలో ఫెర్నాండ్ శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని, అతన్ని హత్య చేసినట్లు చెప్పే ఆధారాలేవీ లభించలేదని తేలింది. ఫ్లోరిడా నుంచి క్యూబెక్ సుమారు 2,500 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఇక్కడకు చేరుకోవడానికి కనీసం 24 గంటలు పడుతుందని అధికారులు చెప్పడం గమనార్హం.