వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పొట్లూరి వరప్రసాద్ ఆస్తులను వేలం వేసేందుకు కెనరా బ్యాంకు సిద్ధమైంది. తమకు చెల్లించాల్సిన రూ. 148.90 కోట్ల మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు ఎన్ని నోటీసులు పంపినా, డబ్బు చెల్లించకపోవడంతో, ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు.2003లో పీవీపీ కేపిటల్ లిమిటెడ్ సంస్థ కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఆ బకాయి వడ్డీతో కలిపి రూ.148.90 కోట్లకు చేరింది.
పీవీపీ కేపిటల్ కెనరా బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకోగా, దానికి పొట్లూరితో పాటు ఆయన భార్య ఝాన్సీ ష్యూరిటీ ఇచ్చారు. వారి మరో సంస్థ పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ కూడా కార్పొరేట్ హామీదారుగా ఉండేందుకు అంగీకరించింది. ఇప్పుడిక రుణం వసూలు కోసం చెన్నై సమీపంలోని పెరంబూరు గ్రామంలో సంస్థ పేరిట ఉన్న దాదాపు 24,355.29 చదరపు మీటర్ల భూమిని వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.